డిసెంబరు 11, 2009 manikya చే
ఈ మధ్యే వచ్చిన “కుర్రాడు” సినిమాలో పాత కాలం హిట్ పాటైన “కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు” (కమల్ హాసన్ నటించిన “అందమైన అనుభవం” సినిమా, రచన ఆత్రేయ అని గుర్తు) పాట రీమిక్స్ వెర్షన్ ఉంది. పాత పాట సాహిత్యం చక్కగా ఉంటుంది. రీమిక్స్ చేస్తున్నప్పుడు అదే సాహిత్యం ఉంచేద్దాం అనుకున్నారుట. అయితే గీత రచయిత అనంత శ్రీరాం, “అలా వద్దు, చరణాలు ఈ కాలానికి తగ్గట్టు నేను కొత్తగా రాస్తాను” అన్నాట్ట. ఈ విషయం అతనే టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా అతను చెప్పినది ఏమిటంటే – “ఈ కాలం కుర్రాళ్ళు అంటే ముందు సిగరెట్టూ మందూ గుర్తొస్తుంది! అందుకే నేను – ధమధమ లాగారు దమ్ము, ధుమధుమ రేగింది దుమ్ము, మనసుకి చేరింది మందు, వెనకిక అవ్వాలి ముందు! – అని రాశానని ఒకింత గొప్పగా చెప్పుకున్నాడు”. నాకు ఇది వినగానే ఆవేశం కలిగింది. సినిమా పరిమితుల దృష్ట్యా అనంత్ శ్రీరాం చెప్పినదే కరెక్టే కావొచ్చు, కానీ కుర్రాళ్ళంటే గుర్తొచ్చేది సిగరెట్టూ మందేనా? ఇంకేం లేవా? ఈ ఆవేశంలోంచి పుట్టిన పాటే ఇది, అదే ట్యూన్‌కి రాసినది –
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
పోటెత్తే సంద్రాలు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
పోటీకే పోటీలు
నీరసాన ఆగిపోరు జీవితాన ఓడిపోరు
నిన్నలోన ఉండిపోరు కష్టమొస్తే పారిపోరు
1. భవితకి భవితే వీళ్ళు
కలలకు కనులే వీళ్ళు
గరళం తాగే ఘనులు
గగనం తాకే నరులు
వీళ్ళేలే సమర శంఖాలు
వాడిపోని ఉదయాలు
అలిసిపోని పాదాలు
రాత మార్చే స్వేదాలు
రేగిపోయే హృదయాలు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
పోటెత్తే సంద్రాలు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
పోటీకే పోటీలు
2. గీతకి ప్రతిరూపాలు
ఆశకి నిజరూపాలు
మట్టిని కడిగే నదులు
మత్తుని తరిమే రవులు
వీళ్ళేలే మార్పు గీతాలు
లేవు వీళ్ళకి సంకెళ్ళు
బాధలైనా సందళ్ళు
వీళ్ళ ఇల్లు హరివిల్లు
వీళ్ళ నిండా పరవళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
పోటెత్తే సంద్రాలు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
పోటీకే పోటీలు
Uncategorized లో రాసారు | 7 వ్యాఖ్యానాలు »
అక్టోబర్ 3, 2009 manikya చే
ఓ సారి బస్ లో వెళ్తూ ఉంటే చున్నీని తలకి చుట్టుకున్న అమ్మాయి కనిపించింది. ఈ దృశ్యం సాధారణమే అయినా, ఆ అమ్మాయి కిటికీ పక్కనే కూర్చోవడం, సూర్యుని ఎండ పడుతూ ఉండడం, ఆ అమ్మాయి చున్నీని చేతితో పట్టుకుని ఎండకి అడ్డుపెట్టడం, ఇటు నుండి చూస్తున్న నాకు పల్చని తెర నుండి అందంగా సూర్యుడు దర్శనమివ్వడం, పక్కనే మబ్బు వెనుక దాగిన చందమామలా కనిపించీ కనిపించని ఆమె ముఖం – ఈ దృశ్యం అంతా నాకు చాలా అందంగా తోచింది. ఈ ప్రేరణతో ఒక ప్రియుడు తన ప్రియురాలిని గురించి పాడుకునే గీతంగా పుట్టిన పాట ఇది.
కురుల మబ్బుల్లో మోము దాచుకున్నా
వెన్నెల కళలన్నీ దాచగలవా జాబిలమ్మా
చెట్టు గుబురుల్లో నువ్వు ముడుచుకున్నా
వలపు ఘుమఘుమలే దాచగలవా పూలకొమ్మా
పారేటి ఆ గోదారి పెదవి విప్పకున్నా
ఉరకల్లో అలజడి మది కథని వినిపించదా
వసంతాన్నే చూడనంటూ తల తిప్పుకున్నా
గుండెలోతు రాగాన్ని కోయిల ఆపగలదా
తెలిసిందిలే నీ వైనం చినుకమ్మా
ఎన్నాళ్ళని మబ్బుల్లో దాగేవమ్మా
నీ కోసం వేచి వేచి ఉన్నానమ్మా
వలపు వెల్లువై నన్ను తడపవేమమ్మా?
Love songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
To Make A Difference (TMAD) అనే ఒక social service organization లో నేను గతంలో active గా participate చేసి ఉన్నాను. మనవల్ల ఏమౌతుంది అని కాక చేతనైన సాయం కావలసిన వారికి చేయాలనే ఈ సంస్థ ఆశయం నన్ను స్పందింపజేసింది. ఇలాటి సంస్థలకి ముఖ్యమైన ఇంధనం ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ఆశయం, కార్యసాధత కలిగిన యువత. అలాటి వాళ్ళు ఈ సంస్థకి కొందరైన ఉండడం, ఆ కొందరి సంఖ్య పెరుగుతూ ఉండడం శుభసూచకం.
నేను రాసుకున్న ఈ పాట వెలుగు నిండి, చుట్టూ చీకటిలో ఆ వెలుగు నింపాలనే తపన ఉన్న యువత పాడుకునేది. తూరుపున ఉదయించే బాలుడంటి సూర్యుడే నెమ్మది నెమ్మదిగా లోకాన్ని కాచే జీవరేఖగా మారినట్టు, చిన్న చిన్న అడుగులతో పెద్ద మార్పులకి శ్రీకారం చుడుతున్న యువతకి అక్షారాభినందనలు తెలపడమే ఈ పాట ఉద్దేశ్యం.
తూరుపు తల్లి ఒడిలో పసి రూపం
పారాడు పాపాయి సందె దీపం
బోసి నవ్వుల బాలుడు బోలెడంత ఎదిగీ
లోకానికవ్వడా కాంతినిచ్చే స్ఫూర్తి
ఆ ఉదయుడూ మా హృదయుడూ
ఆ కిరణం మా నయనం
ఆ జ్వలనం మాకు సహజం
మహోదయమే మా లక్ష్యం
1. కలలే కంటూ కలలో ఉంటూ కాలే కదపని కథ కాము
తీరం మురిసే పాదం మేమై కలలకు నడకలు నేర్పేము
ఇది చేద్దాము అది చేద్దామను ఉత్తి మాటలను అనబోము
చేసేదేదో చేసే చూపి మాటని చేతగ మలచేము
నావల్లేమౌతుందంటూ మిణుగురు ముసుగును వేసిందా
చుట్టూ చీకటి ఎంతున్నా చిటికెడు వెలుగును ఆపిందా
అమ్మో ఎంతో దూరమని మబ్బున చినుకే కూర్చుందా
కరిగీ కదిలీ వాన అయి నేలని తడపక ఆగిందా
తూరుపు తల్లి ఒడిలో పసి రూపం
పారాడు పాపాయి సందె దీపం
2. శోకం కమ్మిన గుండెలకి స్వాంతన కూర్చే ఆశౌతాం
సాయం కోరే కన్నులకి చేయందించే తోడవుతాం
చీకటి మగ్గిన బతుకులలో ముగ్గులు పెట్టే వెలుగౌతాం
దారే తెలియని నడకలకి దిశనే చూపే జత ఔతాం
త్రివర్ణ పతాక రెపరెపలో అశోక చక్రం మేమౌతాం
ఉరుకుల పరుగుల మనుగడలో మనసే ఉన్న మనిషౌతాం
తూరుపు తల్లి ఒడిలో పసి రూపం
పారాడు పాపాయి సందె దీపం
బోసి నవ్వుల బాలుడు బోలెడంత ఎదిగీ
లోకానికవ్వడా కాంతినిచ్చే స్ఫూర్తి
ఆ ఉదయుడూ మా హృదయుడూ
ఆ కిరణం మా నయనం
ఆ జ్వలనం మాకు సహజం
మహోదయమే మా లక్ష్యం
Inspirational songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
వసంతం మీదా, కోయిలమ్మ మీదా చాలా గొప్ప కవితలూ, పాటలూ ఉన్నాయ్. అయినా ప్రతి ఉగాదికి కవులు కొత్తగా రాయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలా నేను చేసిన ఒక ప్రయత్నమే ఇది. ఉగాది 2006 కి రాసినది.
కోయిల కూయని కూసినదేమో
ఓయని ఆమని పలికినదేమో
మనసులు ముడిపడి యుగముల తరబడి
చెదరని చెలిమికి రుజువిదియేమో
మామిడి చెట్టొక అమ్మాయేమో
వలపులు చిగురులు తొడిగినవేమో
పచ్చని ఆశలు, తియ్యని తలపులు
ఫలముగ పండే తరుణమిదేమో
ప్రకృతి కాంతకు పరిణయమేమో
నేల తల్లికిది సంబరమేమో
కొమ్మలు రెమ్మలు ముత్తయిదువులై
పువ్వుల అక్షతలేసినవేమో
వాడని ఆశల పచ్చని గీతం
అణువణువణువున నవ చైతన్యం
మనలో నిండీ అడుగేస్తుంటే
ఉగాది కాదా ప్రతి ఒక ఉదయం?
చేదే అయినా తీపే అయినా
వగరే అయినా వగపే అయినా
ఉగాది విందని భావిస్తేను
బ్రతుకున రుచియే తెలిసొచ్చేను
Situational songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
దళపతి సినిమాలో “భయం వద్దు” అంటూ అరవింద స్వామి ఒక గేయం పాడతాడు, తన తండ్రి పోలీసులకి సాక్ష్యం చెప్పనప్పుడు. ఆ గేయం ఏమిటో నాకు గుర్తులేదు గానీ అలాటి ఒక గేయం రాయాలని చేసిన ప్రయత్నమే ఇది -
భయం వద్దు భయం వద్దు భయమన్నది చీడపురుగురా
మనసు అంత పాకుతుంది తక్షణమే తుంచివెయ్యరా
భయం వద్దు భయం వద్దు భయమన్నది కాళరాత్రిరా
జీవితాన్ని కమ్ముతుంది సూర్యుడివై చెదరగొట్టరా
భయం వద్దు భయం వద్దు భయమన్నది పిరికిపందరా
ఎదురుతిరిగి తరిమికొడితే బెదిరిపోయి పరుగుదియ్యురా
భయం వద్దు భయం వద్దు భయమన్నది ముసలిప్రాణిరా
నీకు నువ్వు చిక్కకుంటె వేట ఆడి పట్టలేదురా
భయం వద్దు భయం వద్దు భయమన్నది తలపు సృష్టిరా
నువ్వు దాన్ని తలచకుంటె తనకు తాను పుట్టలేదురా
Inspirational songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
“అభిలాష” చిత్రంలో “ఉరకలై గోదావరి” అనే గీతం నాకు చాలా ఇష్టం. సంగీత పరంగా (ఇళయరాజా) ఎంత బాగుంటుందో సాహిత్య పరంగా (ఆత్రేయ?) అంతే బాగుంటుంది. ముఖ్యంగా పల్లవి అద్భుతం. “ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి” అన్న భావం నాలో చాలా కాలం ఉండిపోయింది. ఈ స్ఫూర్తితో ఒక ప్రేమ గీతం రాస్తే అది ఇలా వచ్చింది!
గుండెల్లో పొంగింది గోదారి – అలలై
ఆ నీటి ఉరకల్లో గలగల నీదా?
కన్నుల్లో కురిసింది వెన్నెల – కలలై
ఆ కాంతి ధారల్లో మిలమిల నీదా?
నలుదిక్కులు ఉన్నట్టుండీ ఏమైపోయాయో?
ప్రతి దిక్కున కనిపించే నా దిక్కువి నువ్వా?
కవులంతా ఎవ్వరి కోసం కలలే కన్నారో
నిజమల్లే ఎదురయ్యావే, ఆ కవితే నువ్వా?
1. పూసే పువ్వు నవ్వే నవ్వు నువ్విచ్చిందేనా?
తనలో నిన్నే చూపిస్తోందమ్మా
గాలికి తెలియని గుసగుసలెన్నో నేర్పించేశావా?
ఎన్నో ఊసులు చెబుతూ ఉందమ్మా
లేలేత బుగ్గలపై ఎరుపు, ఉదయించే సూరీడికెందుకిచ్చావు?
మెరిసేటి నీ ఒంట్లో విరుపు, విరిసేటి హరివిల్లుకెందుకిచ్చావు?
ఎదురుగ ఉన్నా నాకేం ఇవ్వవా!
2. ఎపుడూ లేదు కొత్తగ ఏదో సవ్వడి వింటున్నా
గుండెలలో నీ మువ్వల స్వరమేమో
పగలే అయినా చీకటి ఏదో కమ్మేస్తూ ఉందే
నీ నల్లని కురులలో చిక్కుకు పోయానో
నువు నాతో జతగా సాగందే, నా పాదం అడుగైనా వేయనంటోందే
నీ కనులతో జగతిని చూడందే, ఏ వెలుగూ నాకోసం రాను అంటోందే
నువ్వే చెప్పు నేనేం చెయ్యాలో!
Love songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
ప్రేమ గీతాలూ, సరసాలూ సరే, అసలు ఈ tune కి ఒక సరదా గీతం రాస్తే ఎలా ఉంటుంది అని పుట్టిన సరదా లోంచి వచ్చిన ఆఖరిదైన 5th version ఇది!
Pallavi:
ఆమె: ఎన్నెన్నెన్నో ఊసులే మెదలసాగే మనసులో
నువ్వే ఏదో మాయనే చేసుంటావు తెలుసుకో
అతను: అయ్యో పాపం అనుకుని చెయ్యందిస్తే నేరమా
నీలో ఉన్న సంగతి నావల్లంటూ నిందలా
ఆమె: తాకాలా అలా పులకింతగా
రేపాలా ఇలా కలలింతగా
అతను:జగడాలా జవరాలా
ఎదగోలే వినలేవా
నిజమేదో కనలేవా
charaNam 1:
అతను:అనుకోని మైకంలో మునిగావేమో
అందుకనే ఏవేవో అంటున్నావో
ఆమె: మైకంలో మెలకువనే చూపే సంగతీ
నీకూ పరిచయమే ఆ తీపన్నదీ
అతను:తెలుసనిపిస్తూనే తెలియనిదుందేమో
తేలని తికమకలో ముంచిందేమో
charaNam 2:
అతను:మనసంటూ మహిమంటూ confusionలా
అర్థమయే వైనంలో వివరించొద్దా
ఆమె: ఎదలోన సడిరేపే ఊహల సందడీ
అడుగు చెబుతుందీ తన పేరన్నది
అతను:సర్లే చాలమ్మా విషయం తేల్చమ్మా
simpleగా i love you అంటే పోదా
Pallavi repeat after charaNam 2 with different lyric:
ఆమె: అన్నీ నీకే తెలిసినా నాతో చెప్పించాలనా
అమ్మాయెపుడూ తనకుగా పెదవే విప్పి పలుకునా
అతను: నీద్వారా విందామని సరదాపడ్డా ముద్దుగా
ఏమంటావో నువ్వని tension పడ్డా కొద్దిగా
ఆమె: పడిపోయాం సరే లౌ మాయలో
ఏం చేద్దాం మరీ ఈ జోరులో
అతను: పదపోదాం ప్రియురాలా
పొమ్మందాం లోకాన్నే
ఏలేద్దాం ప్రణయాన్నే
Love songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
ఇదీ శృంగారం అసలు లేకుండా రాసిన ప్రేమ గీతమే!
Pallavi:
ఆమె:నేనున్నానంటోందిగా నీ తొలి కౌగిలి వెచ్చగా
ఏమయ్యావిన్నాళ్ళుగా అని అడిగింది ప్రేమగా
అతను: ఒంటరిగా ఎన్నాళ్ళిలా ఉంటావంది మనసిలా
చెయ్యందించి తోడుగా నీతో నడవాలందిగా
ఆమె: కనుగొందాం పదా ప్రేమేవిటో
జీవిద్దాం సదా ఆ ప్రేమలో
అతను: ఓ ప్రేమా ఓ ప్రేమా
మా భారం నీదే ఇక పైనా
మా పయనం నీతో ఏమైనా
CharaNam 1:
అతను: అనుకోని వైనంలో కలిశాం నాడు
కలిసింది ఎందుకనో తెలిసెను నేడు
ఆమె:లోకంలో ఏకాకై ఎవరూ లేరుగా
ఏదో అనుబంధం రాసే ఉందిగా
అతను: ఎవ్వరికెవ్వరితో ఏ ముడి వేస్తుందో
చెప్పను అంటుందే చిక్కని ప్రేమా
charaNam 2:
అతను: ముందేమీ కానుందో తెలియదు కానీ
నూరేళ్ళ కలలెన్నో చూపే ప్రేమా
ఆమె:కలలన్నీ ఎదురీది పోదాం జంటగా
తీరం మనకోసం ఎదురౌతుందిగా
అతను: రేపటి ఉదయాన్నీ ఇపుడే చూస్తున్నా
మాపంటూ లేని ప్రేమే మనదా
Love songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
ఇది శృంగారం అసలు లేకుండా రాసిన ప్రేమ గీతం!
Pallavi:
ఆమె: కన్నుల్లోన మెరుపులే కలల వానే కురిసెలే
గుండెల్లోన చినుకులే చిగురులేసే వలపులే
అతను: నిన్నే కోరి ప్రాణమే కరిగి ఏరై పారెలే
నిన్నే లేని ఊసులే ఉరకలేసి ఉరికెలే
ఆమె: ఈ ప్రేమన్నదే చిత్రం కదా
నవలోకాలనే చిత్రించెగా
అతను:వలపంటే వలకాదా
మనసింతేనా ఇంతేనా
పడిపోయేనా వలలోనా
Charanam 1:
అతను:ఇన్నాళ్ళూ ఆకాశం శూన్యం కాదా
హరివిల్లై మెరిసిందీ ఈనాడేనా
ఆమె: మౌనంగా విరబూసే సుమగీతాలిలా
నేడే చెలులయ్యి సరసాలాడెగా
అతను:చూసే చూపులకీ మనసే పుట్టిందా
వలచే మనసంతా వెలుగే కాదా
Charanam 2:
అతను:తడిశాకే తెలిసిందీ దాహం ఎంతో
పొందాకే తెలిసిందీ నీ లోటెంతో
ఆమె: తొలిస్పర్శే పులకింతై చిగురించానుగా
జతలో జీవితమే కనుగొన్నానుగా
అతను:జంటలు వేరైనా బంధం ఒకటేగా
కాలం ఏదైనా ప్రేమే మారేనా
Love songs, గేయాలు లో రాసారు | Leave a Comment »
అక్టోబర్ 3, 2009 manikya చే
ఇది రాసిన రెండో శృంగార గీతం!
Pallavi:
ఆమె:ఏమయ్యిందో తెలుసునా ఓ మనసా నీ మనసుకి
హరివిల్లేదో విరిసెనా చిలిపిగ తడిమే కలలకి
అతను: ఏమయ్యిందో తెలుసునా ఓ వయసా నీ వయసుకి
విరిజల్లేదో కురిసెనా తనువును మీటే తపనకి
ఆమె:వెచ్చంగా ఇలా విచ్చేసెనా
తియ్యన్నీ కలా గిచ్చేసెనా
అతను: వరదల్లే పొంగిందా
వరమల్లే చేరిందా
వరసేదో మారిందా
charanam 1:
అతను: ఎటు ఉన్నా ఎద సొదలే ఎదురయ్యేనా
నిదురంతా నిప్పల్లే నిట్టూర్చేనా
ఆమె:గారంగా కారంగా సుకుమారంగా
నాలో చెలరేగె చలి వలపమ్మ
అతను: వెంటాడిందేమో వెచ్చని పులకింత
కరిగించిందేమో సిగ్గంతా
charanam 2:
అతను: అవునన్నా కాదన్నా ఏమంటున్నా
విననంటూ తనవెంటే లాగిందమ్మా
ఆమె:ఎందాకో ఎటువైపో ఏం చేద్దామనో
ఏదీ చెప్పదుగా ఈ చిచ్చన్నదీ
అతను: సర్లే సరసంగా సరదా పడు కొంచెం
మునిగే కనుగొందాం ముందేముందో
Sensual songs, గేయాలు లో రాసారు | Leave a Comment »