కొత్త సంవత్సరం
2005లో కొత్త సంవత్సరానికి రాసుకున్న కవిత ఇది. telugupeople.com లో పెడితే ఇంకా క్లుప్తత సాధించొచ్చు అన్న కామెంట్ వచ్చింది. ఏమీ ఎడిట్ చెయ్యకుండా ఆ కవితని ఇప్పుడు బ్లాగుతున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు!
అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి?
పండంటి పాపాయిలా విరిసే సూరీడూ, నిండైన జవరాలిలా మెరిసే జాబిల్లీ
రోజూ చూస్తున్నా అందంగా లేవూ?
పరవశంగా సాగే పక్షుల కువకువలూ, ఆనందంగా ఊగే ఆకుల రెపరెపలూ
ఎప్పటికప్పుడు కొత్తగా లేవా?
రాగం పలికే వేణువులా మనసుంటే
ప్రతి గాలి తెమ్మెరా సంగీతమవ్వదూ?
నేస్తమా రారమ్మంటూ స్వాగతిస్తే
ప్రతి అనుభూతీ చినుకులా తడపదూ?
మనల్ని మనం ఆనందంగా ఉంచుకోడానికి
కొత్త సంవత్సరాలూ, సుముహూర్తాలూ, పండుగలూ రావాలా?
జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంటే ప్రతి రోజూ పండుగ కాదా?