రాజకీయనాయకుడా సలామో సలాము!
“తల్లిభారతి కన్నకడుపున రాచకురుపీ రాజకీయం” అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక పాటలో ఆవేదన చెందారు. “రాజకీయం రంకు, దాన్ని ప్రస్తావించినందుకు క్షమించండి. ప్రాయశ్చితం చేసుకుంటాను” అన్నారు దాశరథి రంగాచార్యగారు తన “వేదం జీవన నాదం” పుస్తకంలో. రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు లేకపోలేదు కాని వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని BJP కి చెందిన అరుణ్ శౌరీ ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. చెడు రాజకీయం గురించి ప్రజల్లో చేతన లేదనలేము కాని అది ఉండాల్సిన స్థాయిలో, ఉండాల్సిన దిశలో లేదనిపిస్తుంది.
మన రాష్ట్రం విషయానికి వస్తే, నా జీవిత కాలంలో ఇంత చెత్త రాజకీయ పరిస్థితులు చూడలేదు. ఆ మధ్య దీని గురించి ఆలొచిస్తే కొంత వ్యంగ్యం, కొంత ఆవేదన, కొంత ఆవేశం కలగలిపిన ఈ పాట పుట్టింది -
రాజకీయనాయకుడా సలామో సలాము
కలికాలపు కౌరవుడా సలామో సలాము
కుతంత్రాల మేధుడా సలామో సలాము
భరతమాత దుష్టబిడ్డ సలామో సలాము
ప్రజల మధ్య చిచ్చుపెట్టి
ఆ మంటల వేడి మీద
పాయసాలు వండుకునే
పాపబుద్ధి నీదిరా
మంచి ఏదొ చెడ్డ ఏదొ
తెలియకుండ మాయ చేసి
కాళరాత్రి వెన్నలనే
కుటిలమంత నీదిరా
ఎంత చెడ్డ వాడివీరా నాయకా నాయకా
కర్మ కొద్ది పుట్టినావు నాయకా నాయకా
వంద ఏండ్లు నీకురా నాయకా నాయకా
కడగండ్లే మాకురా నాయకా నాయకా
బొంకుతున్న నిన్ను చూసి
భేష్ భేష్ అంటు మురిసి
మహా నేతవంచు తలచు
జనమేరా నీ సైన్యం
ప్రజలనేమొ నువ్వు ముంచి
చేసినావు గొప్ప మంచి
ఐనా నిను నమ్ముతారు
అది కదా నీ ధైర్యం?
నిన్నని ఏం లాభంరా నాయకా నాయకా
అసలు తప్పు మాదిరా నాయకా నాయకా
మందలాగ మేముంటే నాయకా నాయకా
తోలవా నువ్వైనా నాయకా నాయకా
[slug rajakiya_nayakudaa]