మనసంతా నీ రూపం

by K.S.M.Phanindra

ఇళయరాజాని అమితంగా ప్రేమించే మా కొలీగ్ ప్రశాంత్ గారి పుణ్యమా అని నాకు ఇళయరాజా తమిళ మెలొడీలు కొన్ని వినే భాగ్యం కలిగింది. అందులో Payanangal Mudivathilai చిత్రంలోని "" పాట ఒకటి. ఈ పాట ఇళయరాజా అభిమానుల్లో చాలా పాపులర్. గిటార్‌ని అద్భుతంగా వాడారు ఈ పాటలో. ఈ సినిమా హిందీ రీమేక్‌లో కూడా ఈ పాటని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని "" అనే పాట చేశారు. తమిళ్‌లో SPB, హిందీలో కిశోర్ కుమార్ ఈ పాటని అద్భుతంగా పాడారు.

తమిళ్‌లో ఈ పాట రాసినది వైరముత్తు. చాలా మందికి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. "అమర గీతం" అన్న ఈ చిత్రంలో ఈ పాట తెలుగు వెర్షన్ – "నెలరాజా పరుగిడకు" ని బాలు గొంతులోనే చిమాట మ్యూజిక్ సైట్‌లో వినొచ్చు -

ఈ పాట నాకు తెగనచ్చి నేనూ దాదాపు నాలుగేళ్ళ క్రితం ఒక లిరిక్ రాశాను ఈ ట్యూన్‌కి. అయితే "చందమామ" థీం తీసుకోకుండా, ప్రేమలో పడ్డ ఒక అబ్బాయి తన ప్రియురాలి గురించి, ప్రేమ గురించి మనోహరంగా ఎలా ఊహిస్తాడు అన్న కాన్సెప్ట్‌తో రాశాను. పాట పల్లవిలో భావానికి గుల్జార్ రాసిన "Aye hairat-e-aashiqui, jagaa mat" పాట (మణిరత్నం గురు చిత్రంలోనిది) ప్రేరణ. చరణాల్లో భావాలపై వేటూరి రాసిన "అందమా నీ పేరేమిటి" పాట ప్రేరణ నాకు తెలియకుండానే పడిఉండవచ్చని పాట పూర్తయ్యాక అనిపించింది.

మనసంతా నీ రూపం

ప్రతినిమిషం నీ ధ్యానం

ఇదే ప్రేమ గీతం

ఇదే జీవితం

సదా ఉండిపోనీ నన్నిలా

|| మనసంతా ||

ఏ నిమిషం కనులెదుట నిలిచిందో నీ రూపం

ఆ నిమిషం మరుజన్మే పొందినదే నా ప్రాణం

నీ రూపే అద్దంగా నను నీలో చూస్తున్నా

నీ నుదిటి కుంకుమగా నే వెలిగిపోతున్నా

కనులు చూడని అందముందనీ

భాషకందని భావముందనీ

తొలిసారి తెలిసింది నినుచూస్తే

|| మనసంతా ||

విరిసేటి నవ్వుల్లో పూలెన్ని జల్లావో

మనసంతా పరిమళమే నిను తలచే వేళల్లో

నునులేత సిగ్గుల్లో రంగులనే చిలికావో

హరివిల్లే ఒదిగినది నిను చూసే చూపుల్లో

కనులనింగిలో జాబిలమ్మలా

గుండెగూటిలో కోయిలమ్మలా

కలకాలం కొలువుండిపోవమ్మా

|| మనసంతా ||