పొన్మాలై పొళుదు – నా పాటే వినుడు!
ఇళయరాజా తమిళ పాటల ట్యూన్లకి నేను రాసిన పాటల గురించి ఎలాగూ గతవారం మొదలెట్టాను కనుక ఇపుడు ఇంకో పాట గురించి రాస్తాను. “పొన్మాలై పొళుదు” అనే ఈ పాట నాకు చాలా ఇష్టం, “ఇలయనిలా” కన్నా. అద్భుతమైన ట్యూన్. ఈ పాట వింటే ఒక ప్రశాంత ఉదయం మనలో వికసిస్తుంది. సినిమాలో ఈ పాట కూడా ఉదయం చూపిస్తూ చిత్రీకరించారు. తమిళ సుప్రసిద్ధ గీతరచయిత వైరముత్తుకి ఇది తొలి పాట. తొలి పాటలోనే ఆయన తన కవితాస్థాయిని చూపించారు. మిత్రులు అవినేని గారు వివరించగా ఈ పాట భావం కొంత నేను తెలుసుకున్నాను. “ఆకాశం నాకొక బోధి చెట్టు” అన్న వాక్యం నాకు తెగనచ్చింది. ఇంకో మిత్రుడు సందీప్ కూడా ఈ పాట భావానికి స్పందించి తనూ ఇదే ట్యూన్‌కి ఒక పాట రాశాడు - నా దైవం నువ్వే
నా పాటకి నేను ఎంచుకున్న థీం - ఆశావహ దృక్పథం. గొప్ప ఆశావాది అయిన ఒక యువకుడు ఈ ట్యూన్‌కి పాడితే ఎలా ఉంటుంది అని ఊహించి రాసినది. రచన సులభగ్రాహ్యమే కనుక వివరణలు ఏమీ ఇవ్వదలుచుకోలేదు. అయినా సిరివెన్నెల వారు అన్నట్టు - “నీ పాట భావం నువ్వు చెప్తే కానీ అర్థం కాకపోతే, పాట అసలు ఎందుకు రాయాలని?”
ఆనందం నిలిచె
ఎదురుగ ఆనందం నిలిచె
జీవితమే ప్రేయసిలా
నాకోసం కళలొలికె
పూవుల తేనెల ఆశలతో
పూసీ రాలిన కలలెన్నో
ఎగసీ అలసిన అలలెన్నో
తీరం చేరని కథలెన్నో
తీయనివీ తీరనివీ
కానుకలే నాకవి
|| ఆనందం నిలిచె ||
తూరుపు సందెలు నా ఒడిలో
పోసెను వాడిన తారలనే
నాలో కాంతులు అందించీ
చీకటినవ్వులు నేర్పించి
పూయించా తారలని
రాతిరికి
|| ఎదురుగ ఆనందం నిలిచె||
నేడే నాకొక ఆశీస్సు
రేపే లేనిది నా మనసు
ప్రతి నిమిషాన్నీ వాటేసి
కాలం పెదవులు చుంబించి
తీపులనే తోడుకునే
కళ నాది
బ్రతుకే నా గీతం తెలుసా
బాధైనా హాయైనా
ఏదైనా పాటేగా