జయజయ జయహే, వరల్డ్‌కప్ మనదే!
by K.S.M.Phanindra
చిన్నప్పటి క్రికెట్ క్రేజ్ నాలో నుంచి మాయమై చాలా ఏళ్ళైంది. అలాంటి నాకు వరల్డ్‌కప్ కోసం పాట కావాలని, TV9 కోసమనీ, ఒక రోజు ఫోన్ వచ్చింది. “నవతరంగం” మహేశ్ కుమార్ గారి ద్వారా వచ్చిన ఈ అవకాశం వల్ల మైఖేల్ అనే ఒక చక్కని మ్యూజిక్ డైరెక్టర్, జెన్నిఫర్ అనే ఔత్సాహిక దర్శకురాలు పరిచయమయ్యారు. ఇండియా ఆడుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ పిల్లలు చూస్తూ ఉండగా కరెంట్ పోవడం, పిల్లలు వీధిలోకి వచ్చి ఆట మొదలెట్టడం, చుట్టూ పెద్దలు కూడా జత కలవడం, పిల్లలు నెగ్గడం, కరెంట్ రావడం, మ్యాచ్లో ఇండియా నెగ్గడం, ఇదీ అనుకున్న థీం (final video లో ఈ కథనం చాలా వరకూ ఎడిట్ చేశారు).
థీం ప్రకారం నిజానికి ఇది spirit of cricket పాట కానీ cheerup song to India కాదు. అయినా కొన్ని cheerup song అంశాలు చొప్పించడం జరిగింది లిరిక్‌లో. “ఈ సారి అయినా వరల్డ్ కప్ సొంతమవ్వాలి, నవతా యువతా ఉన్న మన జట్టు చరిత్ర సృష్టిస్తుంది” అని రాసిన వాక్యాలు ఈ రోజు నిజమవ్వడం మంచి అనుభూతిని మిగిల్చింది. టైం లేకపోవడం వల్ల 3-4 గంటల్లో రాసిన ఈ పాట లిరికల్‌గా గొప్పది కాకపోయినా 2011 world cup విజయం వల్ల నాకు కొంత ప్రత్యేకమైనది. భారత్ క్రికెట్ జట్టుకి, యావద్భారత క్రికెట్ అభిమానులకీ అభినందనలు.
సంగీతం:మైఖేల్
గానం: శ్రీ కృష్ణ
దర్శకత్వం: జెన్నిఫర్
1. పరుగులు తీసెయ్ పవరే చూపెయ్ ఉరికే వరదై పదా
సెంచరి కొట్టే సెన్సేషనువై స్టారై వెలగాలిగా
క్రికెట్ అంటే
జస్ట్ గేం కాదే
భారత్ మొత్తం బౌల్డౌతుంది ఈ ఆటంటే!
పిచ్ ఏదైనా సత్తా ఉంటే గెలుపులు మనవే కదా
జనమే మనకై జయహే అంటే ఎదురేముంటుందిక
2. చిన్నా పెద్దా అంతా కలిసి చిందులు వేస్తూ ఇలా
తేడాలన్నీ తరిమే కొట్టీ బౌండరి దాటించగా
దేశం ఒకటై
కలహం ఔటై
జనగణమణగా జండా ఎగరద సా..రే..జ..హా
క్రికెట్ బాలే గుండెకాయగా మారే వింతే ఇదా
ఆ వరల్డ్ కప్పే సొంతమవ్వదా ఈసారైనా ఇక
3. నవతా యువతా కలిసిన ఘనతా చేయద చరితా
మాతరం…వందేమాతరం
నవతా యువతా కలిసిన ఘనతా చేయద చరితా
మాతరం…వందేమాతరం