నేను!

by K.S.M.Phanindra

2005 సంవత్సరంలో నేను ఒక కవిత రాసుకున్నాను. నాలోని వైరుద్ధ్యాలకి నాకు తోచిన అక్షరరూపం అది. ఇది రాసిన కొద్ది రోజులకి “చక్రం” సినిమా రీలీజ్ అయ్యింది. సిరివెన్నెల రాసిన “జగమంత కుటుంబం నాది” పాట విని – “అరే! సిరివెన్నెల కూడా ఇలా వైరుద్ధ్యాలతో ఓ పాట రాశారే” అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏమిటంటే నేను సిరివెన్నెల పాటని తప్పుగా అర్థం చేసుకున్నాననీ, ఆ పాటలో చాలా లోతు ఉందనీ.

ఈ రోజు ఈ కవిత చూసుకుంటే ఎందుకో పోస్ట్ చెయ్యాలనిపించింది. ఇందులో కొన్ని భాషాపరమైన, ప్రయోగపరమైన దోషాలు ఉన్నాయనిపిస్తోంది ఇప్పుడు చూస్తుంటే. అయితే ఏ మార్పులూ చేయకుండా యథాతథంగా ప్రచురిస్తున్నాను.

నేను చైతన్య గీతికని, నేను నీరస స్వరాన్ని
నేను ఆనంద వీచికని, నేను విషాద స్తబ్ధతని
నేను ఆశాదీపాన్ని, నేను నిరాశా రూపాన్ని
నేను రసానుభూతిని, నేను నిర్లిప్తతని

కలలు కనే కళ్ళూ నావే, కన్నీళ్ళు కారే కళ్ళూ నావే
హాయిగ తేలే మనసు నాదే, బరువుగ తోచే మనసూ నాదే
ఏమీ కాననే వినమ్రత నాదే, నేను నేననే అహంకారం నాదే
దేన్నీ కోరని సన్యాసం నాదే, అన్నీ కావాలనే స్వార్థం నాదే

పదుగురితో పాడే గుండె సవ్వళ్ళు నావే, ఒంటరిగా మోగే గుండె చప్పుళ్ళు నావే
వడిగా అడుగులేసే పాదాలు నావే, కదిలీ కదలని పాదాలు నావే
వలపు ఊయలలో ఊగేది నేనే, అలసి నిట్టూర్పుతో ఆగేది నేనే
తలపు మబ్బులపై తేలేది నేనే, తిరిగి నేలపై నడిచేది నేనే

ద్వేషంతో రగులుతుంటే రాక్షసుణ్ణి నేనే
కాముకతే కమ్ముకుంటే మృగాన్ని నేనే
వివేకం నడిపిస్తుంటే మనిషిని నేనే
అందరినీ ప్రేమిస్తుంటే దైవాన్ని నేనే