ముప్పది ఏళ్ళ నేను

ఈ రోజు నా ముప్పయ్యవ పుట్టినరోజు. పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం మానేసి చాలా ఏళ్ళైంది – కొత్త బట్టలూ లేవు, పార్టీలూ లేవు, కేకులూ లేవు. ఇప్పుడు పుట్టినరోజంటే తరచి చూసుకోవడం. ఒక్కసారి గతాన్ని, ప్రస్తుతాన్ని పరికించడం. జీవితంతో సంభాషించడం. ఇదీ annual performance review లాటిదే. ఎటొచ్చీ ఇక్కడ బాసూ మనమే, బంటూ మనమే.బ్లాగ్ అంటే online diary అని కిరణ్ అన్న ఒకసారి అన్నాడు. ఆ definition నాకు చాలా నచ్చింది. డైరీ అంటే మనసువిప్పి మనతో మనం మాట్లాడుకోవడం. కాబట్టి బ్లాగ్ అంటే మనం నిజాయితీగా అనుకున్నది బహిరంగంగా ప్రదర్శించడం. ఇది ఎవరో మెచ్చుకుంటారని చేసేది కాదు. మనకోసం మనం చేసుకునేది. అందుకే నా భావాలు కొన్ని ఇక్కడ.

అప్పుడప్పుడు అనిపిస్తుంది, జీవితం మనకిస్తున్న ఎన్నో వరాలని మనం పొంది కూడా పొందామని తెలుసుకోలేకపోతున్నాం అని. మన దురదృష్టాలని లెక్కపెట్టుకున్నంతగా అదృష్టాలని గుర్తుపెట్టుకోమని. నేనెంత అదృష్టవంతుణ్ణో తెలుసుకున్నప్పుడల్లా ఆనందం కంటే కూడా వినమ్రతాభావం కలుగుతుంది. నాకు ప్రేమామృతాలూ, మాధుర్యాలూ పంచి, ఉత్తేజాన్ని నింపి, నన్ను కడిగి ఓ మనిషిగా నిలబెట్టిన ఎందరికో (తల్లిదండ్రులు, బంధుమిత్రులు, మహనీయులు, పుస్తకాలు…) పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకోవడమే నేను కనీసం చేయగలిగేది.

“నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని” దీవిస్తూ ఉంటారు. ఇక్కడ ఎదగడమంటే సాధారణార్థం, మరింత హోదా, పేరూ, ఉన్నతీ, డబ్బూ వగైరా. ఇంకో భాషలో చెప్పాలంటే – success. ఈ బాహ్యమైన సక్సెస్‌తో పాటూ అంతర్గతమైన సక్సెస్ ఇంకోటి ఉంది. ఇది చాలా కష్టమైనది. అయితే ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది, outer success కైతే కాలం కలిసిరావలసిన అవసరం కొంత ఉంటుంది. నీతో నువ్వు పోరాడడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ద్వేషంతోనో, కసితోనో చేసే పోరాటం కాదిది, ప్రేమతో చేసేది. ఇందులో నిజానికి గెలుపూ లేదు ఓటమీ లేదు, నిన్ను నీవు తెలుసుకోవడమే, నిన్ను నీవు కరిగించుకోవడమే (dissolving yourself). ఇదేదో స్వార్థపూరితమైన పని కాదు. ఒక వ్యక్తి తనని తాను కరిగించుకున్నప్పుడు అతను చుట్టుపక్కల అందరికీ ఎక్కువ ఆనందం పంచగలుగుతాడు. ఈ విషయాన్ని నాకు నేను గుర్తుచేసుకోవడం కోసం నేను రాసుకున్న ఓ పాటని ఈ రోజు స్మరించుకుంటున్నాను. ఇది ఉదయాన్నే నిద్రలేవలేకపోవడం గురించి రాసినదైనా అన్నిటికీ వర్తిస్తుంది.

నాకూ సూర్యుడికీ
ప్రతి ఉదయం పందెం పందెం
ఎవరు ముందు లేస్తారో
చూద్దాం అంటూ

1. కోరుకున్న వెలుగుల కోసం నా పరుగు
కలలవెంట సాగుతు ఉందీ నా అడుగు
మిణుకుమన్న చుక్కల చెంత కొంచెం సేపు మజిలీ చేసి
వెన్నెలతో చీకటితో సల్లాపాల సయ్యాటాడి
రాతిరిఏటిగట్టున పాటలు పాడి
పొద్దుటి పాప కోసం తాయిలం చేసి
నిదురలోన నేను గడిపితే
సూర్యుడేమొ రెప్పవేయడే

2. నాలోనూ ఉండుంటుంది ఓ జ్వలనం
కాని మరి బైటపడదేం ఏ తరుణం
ఎన్నెన్నొ చేసెయ్యాలి అనిపిస్తుంది ఈ నిమిషాన
చూశామా మళ్ళీ పాత నేనుంటాను మరునిమిషాన
నాలో తపనే నిలిచుండేలా
గమ్యం ఒకటే కనిపించేలా
నన్ను నేను మార్చుకుంటే
నేను కూడ సూర్యుడేగా