“మందో”పాఖ్యానం

ఈ పై హెడింగ్ లోని దుష్టసమాసానికి క్షమించాలి. విషయం ఏమిటంటే ఈ మధ్య ఒక మిత్రుని పరిచయం వల్ల నేను కొన్ని సినిమా సందర్భాలకి పాటలు రాయడం జరుగుతోంది. (ప్రాక్టిస్ కోసమేనండోయ్! ఇప్పటి వరకూ రాసినవి ఏమీ సినిమాల్లో పడలేదు.) అలా ఒక మందు పాట రాయాల్సి వచ్చింది, సందర్భం ఏమిటంటే – “హీరో బారులో కూర్చుని బీరు తాగుతూ ఉండగా, పక్క టేబుల్ లో సుబ్రమణ్యం అనే సాటి మందు మనిషి తన కూతురికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నాననీ, అసలు మంచి అల్లుడు దొరకట్లేదనీ, అందరూ మందు లాటి చెడు అలవాటుగాళ్ళేననీ ఒక మిత్రుడితో వాపోతాడు. స్వయానా మందు తాగే వాడు ఇలా మందునీ, మందుతాగేవాళ్ళనీ చులకన చెయ్యడం సహించలేని మన హీరో ఒక పాట అందుకుంటాడు.

ఏడ్చినట్టు ఉంది! ఇదో సందర్భం, అలా అన్నవాడొక హీరో, మళ్ళీ దానికొక పాట – అనుకుంటున్నారా? తప్పు లేదు. కానీ మన సినిమాల స్థాయి ఇలానే ఉన్నప్పుడు తప్పదు మరి. కాబట్టి తిట్టుకుంటూనో, మెచ్చుకుంటూనో ఈ కింద పాట చదవగలరు. మీ “అక్షింతలు” వేసి ఆశీర్వదించగలరు !!

తాగని వాడు గొప్పా మరి తాగిన వాడు చెడ్డా?
తాగుడు ఈజీ విద్యా? అది కాదోయ్ అల్లాటప్పా
పెగ్గే వేసి చెప్తా ఓపిగ్గా వింటానంటే
భక్తులు కారా అంతా ఈ మందున మహిమే కంటే

చరణం 1:

అల్లనాడు మోహినల్లే మందుపోసి మాయేచేసి పొందాములే అమృతం
మందుసాయం లేకపోతే మంచితనమే ఓడిపోతే ఉండేదా భూమండలం?
నేటికైనా ఓటుకోసం ఏరులయ్యి పారుతుంది మత్తిచ్చి ముంచే గుణం
వేసి పారెయ్ ఓటు అంటూ బ్రూటునైనా గ్రేటు చేసే జనముంటే మందే వరం
కార్యాలు సాధించు మార్గాలలో
ముందుండి నడిపేది మందే కదా
ఘనులైన ధనులైన దాసోహమై
శరణంటు సీసాలు పట్టారుగా

చరణం 2:

మచ్చలేని చందురుణ్ణి అల్లుడల్లే కోరుకుంటూ కలలోన జీవించకు
మచ్చలేక వెన్నెలేది తప్పులేని వాడు ఏడి ఇలలోన ఇన్నాళ్ళకు
జీవితంలో సారమంతా తాగినోణ్ణి చేసుకుంటే అమ్మాయికే మేలుగా?
ఆటులున్నా పోటులున్నా ఆటలాగ చూడువాడు ఓ మంచి భర్తవ్వడా?
మథువైన మనువైన ఒకటేనురా
మాధుర్యముంటేనె రుచి సోదరా
కిక్కున్న టేస్టున్న వాడేనురా
సరిజోడు సిసలైన హజ్బెండుగా

చరణం 3:

కంపుకొట్టే మందు కొట్టి చేదు ఉన్నా ఆరగించీ కష్టాలు పడ్డాముగా
రిస్కు ఉన్నా లెక్క లేక అడ్డులున్నా నెట్టుకుంటూ నిలిచాము హీరోలుగా
బాధలున్నా భోరుమనక బారులోన బీరువెనక నడిచాము చిరునవ్వుగా
బీదలైనా మేథలైనా స్టారులైనా “క్రోరు”లైనా కలిశాము ఒకటవ్వగా
భేదాలు లేనట్టి సమసంఘమే
ఏనాడొ చూపింది మన స్నేహమే
బోరంటు లేనట్టి ఆనందమే
బారింట వెలసింది నవలోకమే
చరణం 4:
డబ్బు మత్తు, కీర్తి మత్తు, స్త్రీల మత్తు స్థాయి మత్తు ఏదైన మత్తే గురూ
తేలుతారు, తూగుతారు, వీగుతారు, వాగుతారు మత్తెక్కి జనమందరూ
తాగుడంటే తప్పు అంటూ నిందమోపి చీదరించి చూసేటి వారందరూ
గుండెనిండా మత్తు నిండి విర్రవీగే వాణ్ణిమాత్రం మాటైన అననివ్వరూ
నిజమంటు పలికేది ఒకడేనురా
కపటాలు లేనట్టి డ్రంకర్డురా
పైకేమొ ప్రతివారు మంచోళ్ళురా
లోలోన విషముంది నమ్మొద్దురా