అక్షర శిక్షలు!

నా కవితల పాట్లు!!

వర్గం Misc

అహో ఒక అన్నకు నేడే పుట్టినరోజు!

కొన్ని పరిచయాలు జీవనపరిమళాలుగా మారతాయి. ఆర్కుట్ పుణ్యమా అని నాకు దొరికిన మిత్రులలో అన్నగా అందరిచే పిలవబడే కిరణ్ – నచకి – చక్రవర్తుల – సర్యాంతర్యామి పుట్టినరోజు November, 13.

అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన పాట -

అందరికీ అన్న మా అన్న
మనసే వెన్న
ఆప్యాయంగా పిలిచాడంటే
ఎదలో చెమ్మ

మమతల సామ్రాజ్యానికి
చక్రవర్తి ఇతడు
తెలుగు ఉషోదయంలో
కవనకిరణమితడు
దూరాన ఉన్నా చందమామా
మాకోసం వెన్నెలని పంపుతాడమ్మా
తన తోటలోని నవ్వులన్నీ
చుట్టూ అందరికీ పంచుతాడమ్మా

చదువులెన్నొ చదివినాడు
బ్రతుకు చదివినాడు
జీవితమే ప్రేయసిగా
పాట పాడినాడు
తెలివైన విలువున్న మనిషిలేమ్మా
పసిపాప గుణమున్న పెద్దవాడమ్మా
కలలెన్నొ కొలువున్న  కావ్యమమ్మా
కొరింది సాధించు పంతగాడమ్మా

Youtube లో ఈ పాట –

Song on Kiran Anna

చాలు నీకీ అన్నమయ్య సంకీర్తనలు!

అన్నమయ్య కీర్తనలు నేను విన్నది తక్కువే. విశ్వనాథ్ సినిమాల్లో విన్న కీర్తనలు నాకు చాలా నచ్చేవి. అయినా ఎప్పుడూ అంత శ్రద్ధగా అధ్యయనం చెయ్యలేదు. నా సహోద్యోగి శ్రవణ్ (అన్నమయ్య సంకీర్తనలకి తనవంతు ప్రచారం చేస్తున్న ఔత్సాహికుడు, భక్తుడు. ఇతని బ్లాగు http://annamacharya-lyrics.blogspot.com/ చాలా ప్రసిద్ధి చెందింది) పుణ్యమా అని రెండు అన్నమయ్య పుస్తకాలు చదివాను ఈ మధ్య. ఒకటి జయప్రభ గారి పుస్తకం, అన్నమయ్య సాహిత్యం గురించి. రెండవది పప్పు వేణుగోపాలరావుగారి ఉపన్యాసాల సంపుటి (Flowers at this feet). ఈ పుస్తకాలు చదివి పొందిన స్పందనతో, అన్నమయ్యపై ఆరాధనతో ఒక చిరు ప్రయత్నం చేశాను ఆయన జయంతి సందర్భంగా.

ఒక పాట రాయాలనిపించింది అన్నమయ్య కీర్తనల గురించి. నాకున్న భాషా జ్ఞానం, పాండిత్యం, ఆధ్యాత్మిక జ్ఞానం అతిస్వల్పం కాబట్టి ఈ పాట కూడా సాధారణంగానే ఉంటుంది. పాట ఎత్తుగడ కొంత అన్నమయ్య శైలిలో ఉన్నా అన్నమయ్య వాడే రెండవ అక్షరం ప్రాస నియమం నేను పాటించలేదు. పాటలో తప్పులు ఉండే ఉండచ్చు కూడా. ఈ పాట కేవలం భక్తిభావంతో చేసిన ప్రయత్నంగా భావించ మనవి.

పదకవితా పితామహుడు, హరిసంకీర్తానాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు అయిన అన్నమాచార్యని జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి -

చాలు నీకీ అన్నమయ్య సంకీర్తనలు
వేల భార్యల కన్నను మేలైన సిరులు

దేవభాషకు కూతురైన తేటతెలుగే చాలు
అమృతమ్మును మాని కొంత భక్తి రసమును గ్రోలు
నీకు సరి ఇవి నీవె ఐనవి

నిత్యపూజల కన్ననివియే నిత్యమైనవి నీకు
ఉత్సవమ్ముల కన్ననివియే వేడుకైనవి నీకు
ధన్యుడైతివి పదము వలన

ఎదను కడిగే మథురకృతులే నీకు అభిషేకములు
లోన వెలుగును ఎరుక పరిచే ఉపనిషద్దీపికలు
నీదు గుడికివి వేదఘంటలు

దాచుకొమ్మని నిన్ను వేడే అర్పణాకుసుమాలు
బ్రోచు మమ్మని శరణుకోరే భక్తిశృంగారాలు
నీకు ప్రియమీ ముక్తిప్రదములు

YouTube లో ఈ పాట వినొచ్చు –

ఉగాది – 2010

ఉగాది నాకిష్టమైన పండగ. ఎందుకో తెలీదు కానీ ఉగాదితో ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. రోజూ మాటెలా ఉన్నా ఉగాది రోజున మాత్రం ఉదయాన్నే లేచి సూర్యోదయన్నీ చూడడం, కాసేపు మౌనంగా నాలో నేను మునిగిపోవడం అలవాటు. అలాగే ఉగాది ప్రేరణతో ఒక కవిత రాయడమూ చేస్తూ ఉంటాను కుదిరితే. ఈ సంవత్సరం పుట్టిన కవిత ఇది -

ప్రతి ఉగాది ఒక జీవిత పాఠం
కోయిల పాటే జీవన గీతం
కొమ్మల రెమ్మల పాఠశాలలో
పూసిందీ నా మానస కుసుమం

నిన్నటి చలి గురుతులనే ఎదలో నిలుపుకుని
రాలిన ఆశల ఆకులు మళ్ళీ పేర్చుకుని
పచ్చని నవ్వై చిగురించాలని
నీ గొంతేదో వినిపించాలని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

తీపని చేదని విభజించడమే మానుకుని
అందినవన్నీ మకరందంగా పుచ్చుకుని
రుచులన్నిటినీ ఆస్వాదించీ
సంపూర్ణంగా జీవించాలని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

ఆకుల గలగల మాత్రం ఉంటే చాలదనీ
పిందెలలోనే ఆగిపోవడం నేరమనీ
కలలే కంటే పండగ రాదని
ఫలముంటేనే ఫలితం ఉందని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

అనాది గీతం ఎప్పుడు మొదలో వెదకకనీ
ఆగని జీవన స్రవంతి తుదలే లేనిదనీ
మనసే పాతగ మారని వరకూ
చూసే దృశ్యం సరికొత్తేనని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

గతంలో రాసిన ఉగాది కవితలు ఇవి:

Ugadi 2006

Ugadi 2007

Ugadi 2009

మోహనీషం!

అనగనగా ఒక అబ్బాయి. పేరు రామ్మోహన్. మాటలో సౌమ్యుడు, మనసులో మంచివాడు , బుద్ధిలో కుశలుడు, స్నేహంలో ఉత్తముడు. వీటికి పుస్తకాల పిచ్చీ, ఆధ్యాత్మిక చింతనా కూడా తోడయ్యాయి.

కట్ చేస్తే…

అనగనగా ఓ అమ్మాయి. పేరు శిరీష. ఆమె నవ్వులో తెలుగింటి కళ తళతళలాడుతుంది.  ఉరుకూ, చురుకూ, ఆటా, పాట, సరదా, పరదా ఆమెకు best friends!.

వీళ్ళద్దరూ నాకు తెలుసు. కానీ వీళ్ళద్దరూ ఒకటవుతారని అనుకోలేదు. ఐతే ప్రేమ చిలిపిది కదా – ఎప్పుడు పుడుతుందో, ఎవరిని కలుపుతుందో, ఏ కథ నడిపిస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యే పెద్దల అంగీకారంతో, దంపతులైన ఈ సరికొత్త జంటకి శుభాశ్శీస్సులుగా “గణేష్” చిత్రంలో “సిరి సిరి మువ్వలు” పాట ట్యూన్ లో ఒక పాట రాయడం జరిగింది. ఇక్కడ “సిరి” అంటే శిరీష. పల్లవిలో పేళ్ళి గురించి ప్రస్తావించి, మొదటి చరణంలో సిరి గురించీ, రెండో చరణంలో రాం గురించీ, ఆఖరి చరణంలో వాళ్ళ వైవాహిక జీవనం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తూ రాశాను. ఈ కొత్త జంటకి నా శ్రీమతి “హరిత” gift ఇచ్చిన ఫొటో అసలైన అదనపు ఆకర్షణ.

సిరి సిరి సొగసుల్లో విరిసిన నవ్వులు
మా మోహన రాముడికి జతగా కలిసేను
తొలి తొలి ప్రేమల్లో తీయని ఊసులు
తలపుల అక్షతలై తలపై కురిసేను
జంటంటే ఈ జంటే అంటారందరూ
చూస్తుంటే పండుగలా ఉందీ అంటారు
గుండెలో ఆనందాలే పొంగే సందడిలో
దీవెనై దిగివచ్చారు దివిలో దేవుళ్ళు

తెలుగు ఇంటి మాలక్ష్మిలా ముచ్చటైన పిల్లా
బుగ్గచుక్క పెట్టిందిలా ముద్దబంతి లాగ
సీతమ్మై ఎద మీటిందో
సిరిమువ్వై కదిపిందో
మా రాముని మానసమంతా
తన కొంగున కట్టిందో
పున్నమి తానై నవ్విందంటే
జాబిలి తానే పరుగున రాడా

మాటలోన ఆప్యాయత మనసులోన మమతా
మంచిలోన మామంచిగా మా పిల్లవాడు లేడా
ధ్యానంలో మునిగిన వేళ
హృదయంలో మెదిలింది
బ్రతుకంతా ఆమని లాగ
పూయించే పూబంతి
చెయ్యందించి రమ్మని పిలిచే
కమ్మని కలలే ఇక మొదలాయె

ఒకరికొకరు ప్రాణాలుగా
ఒద్దికైన జంటా
ప్రేమ మీకు పారాణిగా
తోడు ఉంది వెంట!
అనుబంధం మీ సొంతంగా
అనిపించే మీ జంట
అనునిత్యం ఆనందంగా
అలరారే సిరి పంట
ఈ కళ్యాణం ఈ వైభోగం
జీవితమంతా నిలిచే యోగం

హరిలో హరి!

శ్రీమతితో కలిసి వేంకటేశ్వర స్వామి గుడికి వెళితే అక్కడ శ్రీహరి బ్రహ్మోత్సవ వైభవం పులకరింపజేసింది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎదనుండీ పుట్టిన ఒక చిన్న గీతమిది. సాహితీ విశేషం ఏమీ లేదు. అయినా బ్లాగులో పెడుతున్నా!

గోవింద నామము గ్రోలవే మనసా

ఇహపర సాధకమిది తెలుసా

1. ఏడు కొండల వేంకటరమణుని

ఎదనిండా నిలుపుకుని

కుదుటపడిక నువు ఎదగవే మనసా

2. హారతి నీవై వెలిగిన చాలు

బ్రతుకున ధన్యము అయ్యేవు

చీకటి దాటి సాగవే మనసా

Ugadi – 2007

పాడనీ తియ్యగా, తేనె తెలుగు పాటలా
కోయిలై కమ్మగా, గొంతు విప్పి కొత్తగా
చిగురు తొడుగు కొమ్మలోన లేత ఆశగా
రేకు విచ్చు పువ్వులోని బోసి నవ్వుగా
                          |పాడనీ తియ్యగా|

1. ప్రతి ఉదయం నవోదయం చూసే కనులుంటే
ప్రతి రుతువూ వసంతమే పలికే మనసుంటే
మనకి మనమే కోయిల, బ్రతుకు రాగం ఆలపిస్తే
తీపి చేదులొక్కటే స్వాగతిస్తూ సాగిపోతే
నిండుగా నవ్వుతూ చిగురించాలి పచ్చగా
                          |పాడనీ తియ్యగా|

2. “సర్వజితం” సన్నిహితం చేయాలి మనుషులను
ప్రతి మనిషీ ఒక తరువై పూయాలి మనసులను
కోకిలమ్మ గానమే మేలుకొలుపు గీతమై
పచ్చదనపు చిగురులే మనిషితనపు గెలుపులై
జగమంత మారాలి విరబూసే తోటగా

                           |పాడనీ తియ్యగా|


ఉగాదికి కవితలు రాయడం సాంప్రదాయం కాబట్టి “రాయాలని రాసిన” కవిత ఇది. 2007 “సర్వజిత్” నామ సంవత్సర ఉగాదికి రాసినది. పాటలా రాయడానికి ప్రయత్నించడం జరిగింది. పాటలు రాయడంలో కొంత కష్టం ఉంది -
1. ముందుగా లయని కవితలో చూపించాలి
2. శబ్దానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. వినసొంపుగా ఉండడం, పాడుకోడానికి తగినట్టు ఉండడం అవసరం
3. రాశాక tune కట్టడమో, ముందు tune అనుకుని తర్వాత రాయడమో, లేక కొంత ఇదీ కొంత అదీ కలపడమో ఏదో చెయ్యాలి

కాబట్టి గేయం రాయడంలో కొంత స్వేచ్చ తగ్గుతుంది రాసే వాడికి. అనుభవం మీద మెళకువలు తెలుస్తాయి ఏమో! నాకు ఈ అనుభవం అంత లేదని పై పాటని చూసిన వారు గ్రహించొచ్చు. అక్కడక్కడ వాడిన కొన్ని పదాలు నాకే నచ్చలేదు. భావం స్పష్టంగానే ఉంది అనుకుంటున్నాను. ఉగాది ఉదయం ఒక తోటలో నేను నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఊహించుకుని రాసిన పాట ఇది. కోయిల, చిగురించడం, పువ్వులు లాంటి పదాలు కావాలనే repeat చెయ్యడం జరిగింది ఉగాదికి సూచికగా.

Follow

Get every new post delivered to your Inbox.