అక్షర శిక్షలు!

నా కవితల పాట్లు!!

వర్గం Sad songs

ఎందుకు ఎందుకు

"పా" అన్న హిందీ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా పాటల్లో "ముడి ముడి" అన్న పాట నన్ను ఎక్కువ ఆకట్టుకుంది. ఈ పాట మూడు వెర్షన్స్ లో వస్తుంది. రెండు వెర్షన్లు ఆనంద గీతాలైతే మూడోది శోకగీతం. ఈ శోకగీతం వింటున్నప్పుడే నాకు సందర్భం కళ్ళ ముందు మెదిలింది. అంటే సాహిత్యం అర్థం కానీ వారికైనా ట్యూన్ వింటే అన్నీ అవగతమయ్యేలా స్వరపరిచిన ఇళయరాజా గొప్పతనం అది. ఒక రిలేషన్లో ఉన్న ఇద్దరు విడిపోతున్నప్పుడు కలిగే బాధకి స్వరరూపం ఈ పాట అనిపించింది నాకు. ఈ రిలేషన్ అన్నది ప్రేమ కావచ్చు లేక పెళ్ళి కావొచ్చు. కొన్నిసార్లు ఈ విడిపోవడం అన్నది ఒకరి తప్పిదం వల్ల జరిగేది కాదు. కొన్ని పరిస్థితుల వల్ల విడిపోక తప్పని స్థితి ఎదురుకావొచ్చు. ఇలాంటప్పుడే "ఎందుకు ఇలా జరిగింది" అని లోలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇలాటి కొన్ని ప్రశ్నలకి గేయరూపమే ఈ పాట.

దాదాపు ఒక సంవత్సరం క్రితం రాసిన ఈ పాటని ఇప్పుడు పాడి బ్లాగీకరిస్తున్నాను. నేను పాడడం పాటని పాడుచెయ్యడమే కనుక ఇళయరాజాకి క్షమాపణలు!

 

 

ఎందుకు ఎందుకు ఇలా ఎందుకు జరిగెనెందుకు?
ఎందుకు ఎందుకు ఇలా నాలో ప్రశ్నలెందుకు?
ఎందుకు పాదం గతం విడిచి కదలదెందుకు?
రేపటి తీరం పొద్దై పొడిచి దొరకదెందుకు?
ఎందుకూ నిజం ఇలా తరిమెనెందుకు?

బాధే తోడుగా జంట కలిసిందిగా
బంధం జాలిగా సెలవు అంటోందిగా
పువ్వే ఇలా ముల్లాయెనా
కన్నీటిలో కల వాడెనా
సెలయేరిలా కడలాయెనా
కల్లోలమే వలపాయెనా
ఎందుకు జాబిలే జారిపోయె
ఎందుకు జీవితం బోసిపోయె
ఎందుకు కథే సగం మిగిలిపోయె మరి

ఎందుకు ఎందుకు ఇలా ఎందుకు జరిగెనెందుకు?
ఎందుకు ఎందుకు ఇలా నాలో ప్రశ్నలెందుకు?
ఎందుకు పాదం గతం విడిచి కదలదెందుకు?
రేపటి తీరం పొద్దై పొడిచి దొరకదెందుకు?
ఎందుకూ నిజం ఇలా తరిమెనెందుకు?


 

ఎడబాటు వారధి

ఈ పాట సందర్భం ఇదీ:

ప్రియుడు లేని లోటుని తలచుకుంటూ, ప్రియుని రాకకై ఎదురు చూస్తూ పాడుకునే విరహ శోక గీతం అనుకోవచ్చు. ఈ పాటలో “తార, ఆకాశం” మొదలైన వాటిన సినిమా సందర్భ పరంగా ప్రత్యేక అర్థం ఉంది. అయితే అది తెలియకున్నా అర్థం అయ్యేటట్టు రాయడం జరిగింది

ఎడబాటేగా మన వారధి, నిన్నూ నన్నూ కలిపేనది
జ్ఞాపకమేగా మనకున్నది, నిన్నని చూపే నేస్తం అది
శూన్యాల ఈ సంకీర్తన, కానుక చేశా నీకోసమే
నిన్నే తలచే నిట్టూర్పునై, జీవిస్తున్నా కన్నీరుగా

నాతో నడిచిన నీడేది? తోడై నిలిచిన వాడేడి?
నిన్నటి ప్రేమల జాడేది? ఊహల్లో ఆ తీపేది?
అందని ఆశల అంబరమా
ఎందుకు నీకు ఈ తళుకు?
ఎదలను కలిపిన ఓ ప్రేమా
చెదిరిన కలలను చూడమ్మా
నిలిచి ఉన్నాను శోకంగా, కన్నీరే నాకు సాయంగా

నమ్మను అంది నా మనసే, చెంతన నువ్వే లేవంటే
కాలం కదలను అంటోంది, మన జంటను తను చూడందే
చుక్కగ మారి నీవుంటే
కన్నీటి చుక్కై నేనున్నా
రాతిరి మెరిసే నీ వెంటే
చీకటి ఈది వస్తున్నా
వేచి ఉన్నాను వేదనగా, ఎపుడూ రాని వేకువకై

ఒప్పుకో ప్రియతమా

ఒప్పుకో ప్రియతమా నేనంటే ఇష్టం అనీ
చెప్పవా తియ్యగా ఆ మాట నా శ్వాసకి
ఎదురుచూస్తోందిగా ఆత్రంగ నా కౌగిలి
పొదువుకోవాలని పదిలంగ తన గుండెకి
దరికిరావా మేఘమాలా చినుకులా కరిగి
తీర్చలేవా విరహమంతా ప్రేమగా తడిమి

1. సంద్రంలో కెరటంలా అలజడి సాగెను నాలోన
తీరాన్నే చేరేనా హోరిక ఆగేనా?
సడిలేనీ వేదనలా చీకటి కమ్మెను చుట్టూరా
నిశ్శబ్దంలో కూడా రంపపు కోతేనా?
చెలియా నన్నే కరుణించీ లాలించమ్మా ఓ సారి
ప్రేమగ నన్నే ఓదార్చీ ప్రాణం నిలపాలి

2. లోకాన్నే మరిచానే నిన్ను కోరేటి ప్రేమల్లో
నువు కూడా కాదంటే నేనిక ఒంటరిని
హృదయాన్నే పరిచానే నువ్వు నడిచేటి దారుల్లో
నీ పాదం ముల్లైతే ఇంకేం చేసేది?
గుండెలో దాచి కన్నీళ్ళూ బ్రతికానమ్మా ఇన్నాళ్ళూ
కలిసుండేలా నూరేళ్ళూ ప్రేమను వరమివ్వు!

కనురెప్పల కౌగిలి అన్న పాట సందర్భానికి రాసిన ఇంకో పాట ఇది. ఆ పాట ముందు సాహిత్యం రాసినది అయితే ఈ పాట tune కి రాసినది. ఆ పాటలో కొంచెం శోకం ఎక్కువ ఉందని ఆ పాట విన్న వాళ్ళు అభిప్రాయ పడడంతో ఈ పాటలో కొంచెం mild గా శోకం పలికించడం జరిగింది.

పాట చరణాల్లో పాత భావాలనే కొంచెం కొత్తగా express చేసే ప్రయత్నం జరిగింది. అలజడి నిండిన ఎదకి తన చుట్టు పక్కల ఉన్న అలకిడి పడదు. అలాగని ఒంటరిగా ఉంటే ఆ నిశ్శబ్దమూ భరించలేదు. ఈ స్థితినే మొదటి చరణంలో వర్ణించడం జరిగింది. నీ ధ్యాసలో పడి మొత్తం లోకాన్నే మరిచాను, ఇప్పుడు నాకు ఎవరూ లేరు – నువ్వు తప్ప. నువ్వు కూడా కాదంటే నేను ఏమై పోవాలి? నీకోసం నా హృదయం పరిచాను, ఆశగా. నీ పాదమే ముల్లై గుచ్చితే ఏం చెయ్యను? ఇలాటి ప్రశ్నలు రెండో చరణంలో చూడచ్చు.

Follow

Get every new post delivered to your Inbox.