అక్షర శిక్షలు!

నా కవితల పాట్లు!!

వర్గం Sensual songs

హీరో సినిమాలో రస గీతం – 2

ఇది రాసిన రెండో శృంగార గీతం!

Pallavi:
ఆమె:ఏమయ్యిందో తెలుసునా ఓ మనసా నీ మనసుకి
హరివిల్లేదో విరిసెనా చిలిపిగ తడిమే కలలకి
అతను: ఏమయ్యిందో తెలుసునా ఓ వయసా నీ వయసుకి
విరిజల్లేదో కురిసెనా తనువును మీటే తపనకి
ఆమె:వెచ్చంగా ఇలా విచ్చేసెనా
తియ్యన్నీ కలా గిచ్చేసెనా
అతను: వరదల్లే పొంగిందా
వరమల్లే చేరిందా
వరసేదో మారిందా

charanam 1:
అతను: ఎటు ఉన్నా ఎద సొదలే ఎదురయ్యేనా
నిదురంతా నిప్పల్లే నిట్టూర్చేనా
ఆమె:గారంగా కారంగా సుకుమారంగా
నాలో చెలరేగె చలి వలపమ్మ
అతను: వెంటాడిందేమో వెచ్చని పులకింత
కరిగించిందేమో సిగ్గంతా

charanam 2:
అతను: అవునన్నా కాదన్నా ఏమంటున్నా
విననంటూ తనవెంటే లాగిందమ్మా
ఆమె:ఎందాకో ఎటువైపో ఏం చేద్దామనో
ఏదీ చెప్పదుగా ఈ చిచ్చన్నదీ
అతను: సర్లే సరసంగా సరదా పడు కొంచెం
మునిగే కనుగొందాం ముందేముందో

హీరో సినిమాలో రస గీతం – 1

ఒక tune కి ఎన్ని versions రాయొచ్చు? ఒక version రాశాక, కొన్ని మార్పులతో ఇంకోటి రాయడం – incremental versions రాయడం అని పేరు పెట్టొచ్చు. అయితే ప్రతి version నీ ఒక కొత్త పాటలా అంతకు ముందు రాసిన version కి ఏ మాత్రం సంబంధం లేకుండా రాయడం కొంత కష్టం. ఎందుకంటే అదే tune కి రాస్తున్నప్పుడు మనం అంతక ముందు version లో రాసిన భావాలు గుర్తుకు వస్తూ ఉంటాయ్.

ఇలా ఎన్నో versions రాసే అవకాశం నితిన్ నటించిన “హీరో” సినిమాలో వచ్చింది (మా పాటలు ఏవీ తీసుకోలేదు అని standard disclaimer!). హీరో-హీరోయిన్ తమ ప్రేమని వ్యక్త పరచుకుని, తొలి స్పర్శానుభూతి పొందిన సందర్భంలో వచ్చే మెలడీ గీతం ఇది.

సిరివెన్నెల గారు versions 20 దాకా అవలీలగా రాసెయ్యగలుగుతారు అని విని నేనూ ప్రయత్నించి ఒక 5 versions మాత్రం రాయగలిగాను. ఇందులో 2 ప్రేమ గీతాలు, 2 శృంగార గీతాలు, 1 సరదాగా సాగే గీతం ఉన్నాయి.

శృంగారం ప్రథమ రసం కాబట్టి ముందు శృంగారం నిండిన versions తో మొదలుపెడతాను! ఇది మొదటిది –

Pallavi:
ఆమె: వెచ్చని స్పర్శై వెన్నెలై తొలకరివై నువు తాకితే
తియ్యని ముల్లై తుమ్మెదై తుంటరి ఈడే కసరదా
అతను: వెల్లువ మీరే అల్లరై ఊహల జోరే రేగితే
ఝల్లనిపించే గుండెలో తొలి చలి వలపే ముసరదా
ఆమె: పురివిప్పానులే పులకింతగా
మనసిచ్చానులే తుళ్ళింతగా
అతను:కౌగిలిలో లాహిరిలో
లాలించేనా ఈ ప్రేమ
పాలించేనా ఈ ప్రేమ

Charanam 1:
అతను:కన్నులలో కన్నెవరో కొలువై ఉందే
వన్నెలతో వెన్నలనే చిలికించిందే
ఆమె: సుందరుడే చందురుడే ఎదురొచ్చాడులే
ఏవో తొందరలే ఎదురిచ్చాడులే
అతను:నచ్చే వయసుల్లో గిచ్చే కలలెన్నో
విచ్చే కళలెన్నో తెచ్చేనేమో

Charanam 2:
అతను:కాలమిలా కవ్వించీ కన్నే కొట్టె
కోరికలే మేలుకుని వెన్నే తట్టె
ఆమె: సడిలేని సెగలేవో సందడి చేయగా
నాలో అణువణువూ అలలై పొంగెగా
అతను:ముడిపడిపోదామా మతి చెడి పోయేలా
మదనుడి గోలంతా మథురం కాదా

చిలిపి పెళ్ళి పాట

డుం డుం డుం అని మోగింది పెళ్ళి బాజా
కం కం కం అని పిలిచింది సందడంతా
సై సై సై అని గాలి వేసింది కొంటె ఈల
రై రై రై అని దూసుకొచ్చింది చిలిపి గోల
ఇక చాల్లే! ఇన్నాళ్ళ ఒంటరితనం
పందిరేసి కలపాలి జన్మ బంధనం
ముద్దుగా ఉంది ఈ ముద్దమందారం
కొత్తగా నేర్పాలి కాస్త శృంగారం

1. కనుల నింగిలో, కలల మబ్బులో, దాచిన ఆ చంద్రుడు ఎవరమ్మా?
బుగ్గ సిగ్గులో, పెదవి నవ్వులో, పూసిన పులకింతలు ఎవరివమ్మా?
చెప్పమ్మా చిలకమ్మా, చెప్పేస్తేనే మేలమ్మా
లేదంటే నిన్నింకా ఆటపట్టిస్తామమ్మా!
మహబుద్ధిగ ఫోజులు చాలమ్మా, నిజమేదో ఒప్పుకోమ్మా
ఈ అల్లరి అంతా నీకిష్టమేనని మాకెపుడో తెలుసమ్మా!

2. పెళ్ళైతే మీ ఆయన్ని కొంగున ముడేసుకుంటావా?
సమ్మోహన మన్మధ మంత్రంతో నీ చుట్టూ తిప్పించుకుంటావా?
ఇప్పుడే నిన్ను అడిగి తెలుసుకోవాలి సంగతులన్నీ
రేపు పెళ్ళైతే మేమెవరం కనబడం కదా మరి!
సిగ్గు పడకుండా అడిగి తెలుసుకో విషయాలన్నీ
కిటుకులన్నీ తెలిసిన పిల్లనే మొగుడు మెచ్చుతాడు మరి!
ఎంతైనా, ఎపుడైనా మగ వాడు ఆడదానికి దాసుడు కదా
సొగసైన పసికూనా! మహ రాణిలా అతనిని పరిపాలించమ్మా
********************************

ఎప్పుడు రాశానో గుర్తు లేదు గానీ, ఇదొక పాటే! ఒక అమ్మాయికి పెళ్ళి కుదిరాక, ఆమె సన్నిహితులు ఏడిపిస్తూ పాడినట్టు రాయడం జరిగింది. ఇలాటి సందర్భాల్లో కాస్త చిలిపితనం ఉండడం సహజమే కదా!

Follow

Get every new post delivered to your Inbox.