అక్షర శిక్షలు!

నా కవితల పాట్లు!!

వర్గం Situational songs

కోయిల – ఆమని

వసంతం మీదా, కోయిలమ్మ మీదా చాలా గొప్ప కవితలూ, పాటలూ ఉన్నాయ్. అయినా ప్రతి ఉగాదికి కవులు కొత్తగా రాయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలా నేను చేసిన ఒక ప్రయత్నమే ఇది. ఉగాది 2006 కి రాసినది.

కోయిల కూయని కూసినదేమో
ఓయని ఆమని పలికినదేమో
మనసులు ముడిపడి యుగముల తరబడి
చెదరని చెలిమికి రుజువిదియేమో

మామిడి చెట్టొక అమ్మాయేమో
వలపులు చిగురులు తొడిగినవేమో
పచ్చని ఆశలు, తియ్యని తలపులు
ఫలముగ పండే తరుణమిదేమో

ప్రకృతి కాంతకు పరిణయమేమో
నేల తల్లికిది సంబరమేమో
కొమ్మలు రెమ్మలు ముత్తయిదువులై
పువ్వుల అక్షతలేసినవేమో

వాడని ఆశల పచ్చని గీతం
అణువణువణువున నవ చైతన్యం
మనలో నిండీ అడుగేస్తుంటే
ఉగాది కాదా ప్రతి ఒక ఉదయం?

చేదే అయినా తీపే అయినా
వగరే అయినా వగపే అయినా
ఉగాది విందని భావిస్తేను
బ్రతుకున రుచియే తెలిసొచ్చేను

హీరో సినిమా – ఓ సందర్భోచిత గీతం

Note: హీరో సినిమా కోసం నేను రాసిన కొన్ని పాటలని వివరిస్తూ సాగుతున్న ఈ శీర్షికలో రెండవ భాగం ఇది. మొదటి భాగం ఇక్కడ ఉంది

కొన్ని సార్లు సినిమాలో సందర్భాలూ, పాటలూ మారిపోతూ ఉంటాయ్. హీరో సినిమాలో నాయికా నాయికల మధ్య వినిపించే mass touch ఉన్న ఒక శృంగార గీతంలా వినిపించే “క..కలవై” అన్న పాట వెనుక నిజానికి ఒక ఉదాత్తమైన సందర్భం ఉండేదనీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే చివరకి ఆ సందర్భమే మారిందో లేక ఏమయ్యిందో ఏమో (నేను సినిమా చూళ్ళేదు) ఇలా “క కలవై” అంటూ ఓ “ఉత్తుత్తి పాట” దర్శనం ఇవ్వడం నాకు ఒకింత ఆశ్చర్యం, ఒకింత బాధ కలగజేస్తుంది.

మాకు చెప్పినప్పుడు పాట సందర్భం ఇది:

కథానాయిక అనుకోని పరిస్థితులలో ఓ నేరం చూడ్డం, దాని వలన విలన్ల నుండి ఇబ్బందులు ఎదురుకోవడం, బెదిరిపోవడం జరుగుతుంది. చివరకి హీరో సంరక్షణలో చేరడం వాళ్ళ మధ్య ప్రేమ మొలకెత్తడం జరుగుతుంది. హీరోయిన్ బెదిరిపోయి “నేను సాక్ష్యం చెప్పను” అంటే హీరో తనకి ధైర్యం చెప్తూ, ఉత్తేజం కలగజెయ్యడం, అలాగే ఇరువురూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తపరుచుకోడం జరగాలి.

సో ఈ పాటలో రెండు భిన్న ఆలోచనలు, నెమ్మదిగా కథానాయిక హీరో ఆలోచనల వైపు మొగ్గు చూపడం కనిపించాలి. దీనిని దర్శకుడు artistic gaa చూపిద్దాం అనుకున్నాడు. అందుకే హీరోయిన్ భరత నాట్యం, హీరో western dance చేస్తూ ఉంటారు పాటలో. సంగీత దర్శకుడు మణి శర్మ కూడా హీరోయిన్ పాడేప్పుడు సాంప్రదాయ రాగంలో, హీరో పాడేప్పుడు మోడర్న్ ట్యూన్ ఉండేటట్టు ఒక fusion song లా చక్కగా స్వరపరిచారు.

నేను పల్లవిలో హీరో హీరోయిన్ల మధ్య conflict ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాను. మొదటి చరణంలో హీరో “వేకువకి వంతెనలా జాబిలి తన వెన్నెలని యథా శక్తి పంచుతుంది” అనడం (అంటే – నువ్వు ధర్మం నిర్వర్తించాలి అని చెప్పడం), హీరోయిన్ “జాబిలిని అయితే వెన్నెల ఉండేది, కాని నేనొక మిణుకు మిణుకుమనే మామూలు నక్షత్రాన్ని. నా వల్ల ఏమవుతుందీ?” అనడం, హీరో – “నేను సూర్యుడినై నీకు తోడు వస్తాను” అని చెప్పి తనని కొంత convince చెయ్యడం, ఆమెలో మార్పు చూపించాను. రెండో చరణంలో ఇద్దరూ కలిసి చెడుతో సమరం చెయ్యాల్సిన అవసరం గురించీ, ఇద్దరి మధ్య ప్రణయం గురించి పాడుకోవడం కనిపిస్తుంది:

పల్లవి:
అతను:
చెబుతున్నా వినలేవా భయపడిపోకే కూనా
నీ వెంటే నేనున్నా ఏమైనా జత కానా
ఆమె:
ఆలోచనే నాలో ఏదో రేపిందిగా కలవరమెంతో
దాటాలిగా అనుకుంటున్నా ఆపిందిగా భారం ఏదో
ఇంకెన్నాళ్ళ దాకా ఈ ఆటా
మరి ఏనాటికైనా గెలిచేనా
అతను:
నన్ను నమ్మవా నాతో రావా చెయ్యి అందుకోలేవా
నన్ను కొత్తగా కనుగొనగలనా నిన్ను చేరుకోగలనా
చరణం 1:
అతను:
చీకటి వాకిట నిలిచిన జాబిలి బెదురుగ ముసుగేస్తుందా
రేపటి వేకువ వెలుగుల కోసం వెన్నెల వంతెన కాదా
ఆమె:
జాబిలి కాను తారను నేను మెరిసీ ఫలితం ఉందా
అతను:
సూర్యుడు నేనై తోడున్నాగా వెలుగుల రెక్కలు ఇస్తాగా

చెబుతున్నా వినలేవా భయపడిపోకే కూనా
నీ వెంటే నేనున్నా ఏమైనా జత కానా
ఆమె:
పాడెదెలా రాగాలెన్నో నా గొంతులో శ్రుతిపోతుంటే
చేసేదెలా నాట్యాలెన్నో నా పాదమే తడబడుతుంటే
అనుకున్నానుగా ఇన్నాళ్ళూ
ఇక తెంచాలిగా సంకెళ్ళూ
అతను:
నన్ను నమ్మవా నాతో రావా చెయ్యి అందుకోలేవా
ఆమె:
నన్ను కొత్తగా కనుగొంటున్నా నిన్ను చేరుకుంటున్నా

చరణం 2:
అతను:
చెడుతో సమరము చేయక తప్పదు చీడను తుంచేదాకా
బిగిసిన పిడికిలి భయపడి సడలదు శత్రువు ఓడేదాకా
ఆమె:
ధైర్యం నువ్వై తోడొస్తుంటే లోకాన్నే ఎదిరిస్తాగా
అతను:
తనలో సత్తా తెలిసిందంటే ప్రతి మనిషీ ఒక సైన్యంగా
అతను:
పంజరమే వీడిందా బంగరు రంగుల చిలకా
తన మనసే బంధనమై ఇన్నాళ్ళూ ఆపిందా
ఆమె:
నీ మాటలే మంత్రం కాగా నా గుండెలో నాదం విన్నా
నీ ప్రేమలో ఉదయిస్తున్నా సంకోచమే కరిగిస్తున్నా
ఒక ఆవేశమే పుట్టిందా
ఈ నాట్యానిగా పొంగిందా
అతను:
మబ్బు చాటున జాబిలి గువ్వా బయటకొచ్చి మెరిసిందా
ఆమె:
మూగబోయిన ఈ సిరి మువ్వా నిన్ను చేరి పలికిందా

ఈ పాట ఇప్పుడు చదివితే కొన్ని లోపాలు కనిపిస్తాయి. ఏమిటంటే హీరోయిన్ మరీ తొందరగా convince అయిపోతుంది ఇక్కడ. అలా కాక కొంత పొడిగించి పాట చివరలో convince అయ్యేట్టు రాస్తే బాగుండేది. అలాగే మొదటి చరణంలో జాబిలి – వంతెన అంటూ చెప్పాలనుకున్న భావం ఇంకా స్పష్టంగా వ్యక్తపరచాలి. పల్లవి weak గా ఉంది.

Reference కోసం “అనంత శ్రీరాం” సినిమాలో ఉన్న “క..కలువై” పాట ఇక్కడ పొందుపరుస్తున్నాను:

పల్లవి:
అతను:
క..కలవై క..కలువై
Come to me baby come come
చ..చలివై చ..చెలివై
Come to me నారీ జం జం
ఆమె:
తోం తోం తనా తోం తన ధినా
తోం తోం తనా ధిరనన ధినా
సుకుమారాలే మారం చేసేలా
సుఖభారాలే నాపై వెయ్యాలా
అతను:
అందగత్తెతో అంతే అంతే చెయ్యమంది నా ప్రాయం
అంతు చూడక ఉంటే ఉంటే ఊరుకోదు నా హృదయం
ఆమె:
చందనాలతో స్నానాలాడే సుందరాంగి సింగారం
సూర్యతాపమే సోకిందంటే ఓపలేదు వయ్యారం

చరణం 1:
అతను:
చేరక చేరక నీ దరి చేరా
Why dont you reach me, baby?
కోరక కోరక నీ జత కోరా
Why don’t you touch me, baby?
ఆమె:
తడబడి తీయని తొందరలో పడి
వదలను వనితా శీలం
అతను:
మతి చెడుతుంటై మస్తుగతింటై
మరవాలంటా ఈ కాలం

చరణం 2:
అతను:
దోరగ దోరగ నీ వయసుంటే
How can I control, myself?
ఓరగ ఓరగ నీ కనులుంటే
How can I convince myself?
ఆమె:
తమకములన్నవి తుళ్ళిన వేళల
తనువున తొలచే దాహం
అతను:
టకటక నన్నే అల్లుకుపోతే
కుదురౌతుందే నీ దేహం

Follow

Get every new post delivered to your Inbox.