హీరో సినిమా – టైటిల్ సాంగ్

“హీరో” అనే నితిన్ సినిమాకి కొన్ని పాటలు రాసే అవకాశం మాకు (నేను, మరో ఇద్దరు మిత్రులు) వచ్చింది. అంటే సినిమాలో మా పాటలు తీసుకుంటారని కాదు. మాకొక practice లా అన్న మాట. ఇలా సరదాగా ఒక నాలుగు పాటలు రాయడం, నేర్చుకోవడం జరిగింది. తర్వాత మా lyrics ని professional writer రాసిన lyrics తో పోల్చుకోడం, సినిమా ఆడియో ఫంక్షంకి హాజరు కావడం మొదలైన కొన్ని చక్కటి అనుభూతులు ఈ సినిమా మిగిల్చింది. ఇందులో నేను రాసిన పాటల్ని మీతో పంచుకుంటాను. ఈ పోస్ట్ లో ఈ సినిమా టైటిల్ సాంగ్ గురించి.

సినిమా టైటిల్ సాంగ్ కి సందర్భం ఏమీ లేదు. హీరో చక్కని చుక్కల మధ్య ఉంటాడు, ఆ అమ్మాయిలు అతని రొమాంటిక్ నేచర్ గురించి, హీరోయిజం గురించీ పాడతారు అని మాత్రమే చెప్పారు. అంటే ఇదో peppy number అన్న మాట. కాబట్టి లిరిక్ లో పెద్ద విషయం ఏమీ ఉండదు.

ఈ పాట రాసిన professional lyricist “అనంత శ్రీరాం”. కమర్షియల్గా, క్యాచిగా రాశాడు. అయితే కొంత నాటుతనం ఉందనీ, కొంత మితి మీరాడనీ అనుకోవచ్చు:

సై కుర్రాడే సై కుర్రాడే
తాకి చూస్తే షాక్ కుర్రాడే
చూపు తోటే చింపుతాడే
షేపు తోటే చంపుతాడే
తన చిటికినేలితో పెదవి చిదిమితే చితుకుతాయి బిడియాలే
అరె చితుకుతాయి బిడియాలే

ఇటువంటోడికి తోడుగా ఉంటే చాలొక రాతిరి
నరముల్లోపల నిండదా కుదిపే కమ్మని తిమ్మిరి

పోకిరోడే పోకిరోడే పాయిజన్ లాగ పాకుతాడే
ఉల్ట్రా మేనై దూకుతాడే మేచో మేనై దున్నుతాడే
తన ఎడమచేతితో నడుము గిల్లితే నలుగుతాయి పరువాలే
మరి నలుగుతాయి పరువాలే

ఇటువంటోడికి తోడుగా ఉంటే చాలొక రాతిరి
విపరీతంగా పొంగదా జిల్ జిల్ జిల్లని ఊపిరి

దన్నుగాడే దమ్ముగానే దూసుకెళ్ళే హీరొ గాడే
చేతులున్న చాకు వీడే ప్రాణమున్న బాకు వీడే
తన చిటికె చప్పుడే చెవిన చేరితే చెదురుతాయి శీలాలే
అరె చెదురుతాయి శీలాలే

ఇటువంటోడికి తోడుగా ఉంటే చాలొక రాతిరి
సెగలై బయటకి తన్నదా అందం లోపల ఆవిరి

నేను రాసిన పాటలో, “అనంత” పాటకి ఉన్న స్టైల్ లేదు. పరిపక్వత ఇంకా రావాలని తెలుస్తుంది. భాష కూడా ఈ పాట ట్యూన్ కి తగినదు కాదు, అక్కడక్కడా. అయితే పచ్చిగా కాకుండా, అసభ్యత లేకుండా రాయడానికి ప్రయత్నించాను:
కత్తిలాంటి కుర్రవాడే
స్టైలులోన కింగువీడే
చక్కనైన చిన్నవాడే
చుక్కలన్నీ వీడితోడే
తొలిపొద్దు కిరణమై కొంటె ఊసులే తట్టిలేపుతాడే
ఎదపట్టు రేపుతాడే హీరో, వీడే హీరో హీరో హీరో
హీరో ఫ్రెండ్షిప్ కోసమే తెగ క్యూలే కట్టెను యువతులే
లౌ వల్లో పడతాడనే సిగపూలే పెట్టెను పడతులే

మెరుపు కోరే ఉరుము వీడే
చిగురు కోరే చినుకు వీడే
ఇంతి కోరే జంట వీడే
పెదవి కోరే పంట వీడే
సరసాల తోటలో సిగ్గుపువ్వులే విచ్చుకున్న వేళ
గుప్పుమన్న వలపే వీడే, హీరో వీడే వీడే వీడే
మచ్చే లేని చంద్రుడు, చిరునవ్వుల వెన్నెల వీరుడు
కల్లో దూరే చోరుడు, గిలిగింతలు పెట్టే మారుడు

అందగాడే ఎదుట ఉంటే
రెప్పకూడా వెయ్యలేరే
చూసి చూసీ పాడులోకం
దిష్టి ఎంతో కొట్టినాదే
అమ్మాయిలందరూ సొంతమౌ అనీ పంతం పట్టినారే
జతకట్టు అంటున్నారే కానీ మొరలే వినడే వినడే వినడే
చిక్కడు దొరకడు చిలకడు, మరి అస్సలు ఉలకడు పలకడు
త్వరపడు పిల్లా త్వరపడు, ఎద బంధం వేసి జతపడు