జ్ఞాపకంలో మెలకువగా…

జీవితమంటే జ్ఞాపకాలని పోగుచేసుకోవడం అని కొందరంటారు
కానీ నేను మాత్రం జ్ఞాపకాలని స్పర్శించడమే కానీ
జ్ఞాపకాల్లో జీవించలేను

కొన్ని జ్ఞాపకాలని తలచుకున్నప్పుడు చిన్న గగుర్పాటు
కొన్ని జ్ఞాపకాలని పలకరిస్తే ఏదో ఇబ్బంది
ఈ అసౌకర్యమే, లోలోపల మెదులుతున్న భయమే
బహుశా నన్ను జ్ఞాపకాలని పొదువుకోనివ్వదు

తీపి జ్ఞాపకాలూ ఉంటాయి కానీ
నిన్నటి పూలతోటల్లో విహరించడం కన్నా
ఇప్పటి వసంతాలని ఆస్వాదించడమే నాకిష్టం
గతంతో మర్యాదపూర్వక స్నేహభావమే కానీ
ఆత్మీయ అనుబంధం నాకు లేదు

జ్ఞాపకాలతో ఆడుకుంటే ఫర్వాలేదు కానీ
జ్ఞాపకాలలో నన్ను నేను పారేసుకుంటేనే సమస్య
మనసుపాప జ్ఞాపకాల బొమ్మ కావాలని మారాం చేస్తూనే ఉంటుంది
అడిగినప్పుడల్లా ఇవ్వాలా వద్దా అనేదే నేను తేల్చుకోవలసింది

జ్ఞాపకాల నుండి పారిపోవడం
జ్ఞాపకాలలోనే ఆగిపోవడం
ఈ రెండూ నాకు సరిపడవు
కాసేపు జ్ఞాపకాల కుటీరంలో సేద తీరి
అంతలోనే జ్ఞాపకాల వేసంగిలో మాడి మాడి
నా పయనం సాగుతూనే ఉంటుంది

మబ్బులు ముసురుకున్న ఆకాశం అందంగానే ఉంటుంది
కానీ ఆకాశం అంటే మబ్బులు మాత్రమే కాదు
అనంతమైన ఆకాశం లాంటి జీవితాన్ని ఆస్వాదించాలంటే
పూసిన హరివిల్లుని పలకరించాలంటే
తారల తళుకులని తిలకించాలంటే
కొన్ని సార్లు మబ్బులు అడ్డుపడతాయి కూడా

మబ్బులు బాగుంటాయి గానీ
మబ్బులని కరిగించి చినుకుల్లో తడవడం
ఇంకా బాగుంటుంది

11 Comments

  1. “…మబ్బులు బాగుంటాయి గానీ
    మబ్బులని కరిగించి చినుకుల్లో తడవడం
    ఇంకా బాగుంటుంది…”

    జ్ఞాపకాల మధురిమల మీద చక్కని పద కూర్పు. చాలా బాగుంది.

  2. గతంతో మర్యాదపూర్వక స్నేహభావమే కానీ
    ఆత్మీయ అనుబంధం నాకు లేదు

    మనసుపాప జ్ఞాపకాల బొమ్మ కావాలని మారాం చేస్తూనే ఉంటుంది
    అడిగినప్పుడల్లా ఇవ్వాలా వద్దా అనేదే నేను తేల్చుకోవలసింది

    మబ్బులు బాగుంటాయి గానీ
    మబ్బులని కరిగించి చినుకుల్లో తడవడం
    ఇంకా బాగుంటుంది

    చక్కని భావాలు గుదిగుచ్చి వ్రాసావు, సోదరా! చాలా బాగుంది!

  3. నిన్న నా బాల్యమిత్రుడు లండన్ నుంచి వచ్చాడంటే పలకరించటానికి వెళ్ళాను. ఒక సందర్భంలో బ్లాగులో అప్పుడప్పుడూ కవితలు చదువుతూంటాను. చాలా మట్టుకు అర్ధం కావు. అంటే ఏ కవిత అర్ధంకాలేదో చెప్పు నేను వివరించటానికి ప్రయత్నిస్తాను సిగ్గుపడుతో. నా బ్లాగు ఓపెన్ చేసి కొన్న కవితలు చదివి వినిపించాను. అబ్బబ్బే నా సర్క్యూట్స్ కలవటంలేదు అయినా నువ్వు చెపుతూంటే అర్ధం అవుతుంది. – ఒకె ఒకె ఇప్పుడు నువ్వు రాయని, మరో బ్లాగులోని కవితను నాకు వివరించు అని అడిగాడు. అపుడు కూడలిలో సాహిత్యంలోని కొన్ని కవితలను చూసి,. మీ ఈ కవితను నేను మరింత ఎంజాయ్ చేస్తూ వివరించాను. నా మిత్రుడు మరింత బాగా ఎంజాయ్ చేసాడు కవిత . నేనూ చాలా బాగా అశ్వాదించాను.
    అద్బుతం మిత్రమా. నా దృష్టిలో కవిత/కవిత్వం అనేది హార్డ్ హిట్టింగా, ప్లెయిన్ గా ఉండాలి. అదే సమయంలో ఒక మంచి రసానుభూతి కలిగించాలి. అస్ఫష్టత, పిచ్చికగూడు లాంటి అల్లిక వంటివి ఎందుకో ఎక్కువ పఠనానుభవాన్ని ఇవ్వవు.

    ఈ కవిత చాలా బాగుంది మిత్రమా. హాయిగా, మంచి కవిత చదివామన్న తృప్తినిస్తో
    భవదీయుడు
    బొల్లోజు బాబా

    1. @బొల్లోజు బాబా

      మీరు ఎంతో ఆత్మీయంగా రాసిన మాటలు నా కవితకు అందిన గొప్ప ప్రశంసగా భావిస్తాను. కవిత్వం అంటే ఏమిటో తెలియకున్నా, ఏదో రాయాలన్న తపనతో, ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న నాబోటి వారికి మీ వంటి పెద్దల సూచనలు చాలా అవసరం. మీరిచ్చిన స్ఫూర్తితో మరింత బాగా రాసే ప్రయత్నం చేస్తాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a reply to చిన్ని ఆశ స్పందనను రద్దుచేయి