“ఇంద్ర” కందాలు!

సిలికానాంధ్రా  మనబడిలో ఈ మధ్య “ప్రభాసం” తరగతికి పాఠాలు చెప్పడం మొదలెట్టాను. దాంతో చాన్నాళ్ళ తరువాత అలంకారాలూ, ఛందస్సూ, తెలుగు పద్యాలూ చదివే అవకాశం కలిగింది. పద్యం అంటే మక్కువ పుట్టుకొచ్చింది. నాకు స్కూల్ రోజుల్లో నేర్చుకున్న తెలుగు పద్యాలంటే ఇష్టం ఉన్నా, యతిప్రాసల కోసం ప్రాకులాడటం నావల్ల కాదనిపించి ఎప్పుడూ పద్యం రాసే ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడు మనబడి పుణ్యమా అని కొత్తగా పుట్టుకొచ్చిన ఇష్టము కొంత, చక్కని పద్యాలు రాసిన నా మిత్రులు కిరణ్, సందీప్, ఈ మధ్య తన కందపద్యాలతో డెందములూపుతున్న చంద్ర వంటివారి స్ఫూర్తి కొంత కలిసి నేనూ కొన్ని కంద పద్యాలు రాయాలని దీపావళి నాడు సంకల్పించాను.

“ఇంద్రా” మకుటంతో కొన్ని నీతిపద్యాలు రాయాలని నా ఆలోచన. “ఇంద్రా” అంటే నా పేరులో భాగమే కాక “ఉత్తముడు” అనే అర్థమూ ఉంది. కొన్నేళ్ళ క్రితం హఠాత్తుగా చనిపోయిన మా మురళీ బాబయ్య నన్ను ఆప్యాయంగా “ఇంద్రా” అని పిలిచేవాడు. కాబట్టి ఇది మా బాబయ్య స్మృతికి నివాళి కూడా!

ఈ కందపద్యాల్లోని తప్పొప్పులు పెద్దలు తెలుపగలరని నా విన్నపం!

1. మంచిని పెంచెడి మాటలు
యించుక మనసులు కలిపెడి ఇంపగు మాటల్
మంచుగ కురిసెడి మాటలు
ఎంచుచు పలికెడి తెలివిని ఎరుగుము ఇంద్రా!

ఓ ఇంద్రా! మంచిని పెంచే మాటలూ, కొంచమైనా మనసులని కలిపే ప్రియమైన మాటలూ, మంచులా చల్లగా కురిసే మాటలూ, ఇలాంటి మాటలను ఎంచుకుని పలికే తెలివిని తెలుసుకో!

 

2. కలడని కొందరి వాదము
కలడను భావన భ్రమయని కలబడు నితరుల్
కలడని లేడని వాగక
కలరూపును హృదితలపున కనుమా ఇంద్రా!

ఓ ఇంద్రా!  దేవుడు ఉన్నాడని కొందరు వాదిస్తారు. “అది ఒట్టి భ్రమ!” అని పోట్లాటకి సిద్ధపడేవారు మరికొందరు. ఈ ఝంఝాటంలో పడక, అటో ఇటో వాదిస్తూ కూర్చోకుండా, నీ హృదయపు ధ్యానంలో భగవంతుని నిజరూపాన్ని దర్శించు!

౩. అల్పము జీవితకాలము
అల్పము మనుజుని ఉనికియు అఖిలాండమునన్
అల్పము కానిది ఒక్కటె

అల్పము తానని ఎరుగని అహమది ఇంద్రా!

ఓ ఇంద్రా! మానవుని జీవితకాలం అల్పం. ఈ అఖిలాండంలో అతనో చిన్న రేణువు మాత్రమే! ఈ అల్పత్వాన్ని ఎరుగని అతని అహంకారం ఉందే, అది మాత్రం అనల్పం, అనంతం!

4. అమవస నిశిలో సైతము
అమరును పున్నమి సొగసుగ ఆశాదీప్తుల్
తమ నవ్వుల దివ్వెలతో
తిమిరములను తరిమికొట్టు ధీవరులింద్రా!

ఓ ఇంద్రా! కొందరు ఏ వెలుగూ లేని అమావాస్య చీకటిలో సైతం తమ ఆశతో పున్నమి వెన్నెల వెలుగులు కురిపిస్తారు. తమ నవ్వుల దివ్వెలతో చీకట్లను తరిమికొట్టే ధీరులు వారు!

(దీపావళి రోజున  రాసిన పద్యం! సిరివెన్నెల రాసిన “ఏటికొక అమవాస దీపావళి, ఓటమెరుగని ఆశ దీపావళి” అనే ప్రవైటు గీతం ప్రేరణ!)

5. తనకై యేదియు కోరదు
తనయునికై పలువిధంబు తపనను చెందున్
జననికి యెనయగు జన్మము
కనరాదు జగతిని ఘనత గనుమా యింద్రా!

ఓ ఇంద్రా! తల్లి తనకై ఏమీ కోరుకోదు. తన పిల్లల కోసం మాత్రం పదే పదే తపన చెందుతుంది. అటువంటి తల్లికి సమానమైన జన్మ ఈ జగతిలో లేదు! అటువంటి తల్లి ఘనతని తెలుసుకో!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s