పూయక రాలిన పువ్వు!

నువ్వు హిందువువనో లేక ముస్లిమ్‌వనో నీకు తట్టేలోపు
నీ శ్వాస వెచ్చదనం నిన్ను తాకుంటే
నువ్వు మనిషివన్న స్పృహ నీకు కలిగి ఉండేది

కానీ
మసీదులోంచి వినబడే నమాజుకో
గుడిలోంచి పలికే సుప్రభాతానికో
పవిత్రంగా కట్టుబడాల్సిన దేశంలో
మౌనంగా మనిషిలా మిగిలడం మహాపాపం!

కేవలం మతం పేరు చెప్పి
పరిచయమైనా లేని వాళ్ళపైన
అనుమానాలూ, అపార్థాలూ
అపనమ్మకాలూ, పగలూ
రేకెత్తించగల రాజకీయ సామాజిక విషవలయంలో
అనామకులకు ఉనికి లేదు!
టోపీనో బొట్టో పెట్టాల్సిందే!

ఎవరు పెద్ద దోషో తేల్చేందుకు
పాతకాలపు పాపాల చిట్టాలూ
తప్పొప్పుల లెక్కలూ తిరగేసి
ఒకరికొకరు మసి పూసుకునే క్రీడలో
కమ్ముకున్న చీకటి నీడలే
వెలుగురేఖలుగా కనిపిస్తాయి
అగ్గితో ఆట మొదలెట్టాక
కాలుతున్న వాసనలే
సాంబ్రాణి ధూపాలుగా పరిమళిస్తాయి

మనం పోసిన నీరుకి పుట్టిందని
పిచ్చి మొక్కల్ని సైతం కాపాడి పెంచే
సరికొత్త ధర్మంలో
పువ్వులను పూయించాలన్న ధ్యాస
ఎవరికి ఉంటుంది?

ఇలా ఎందుకైందన్న
కన్నీటి ప్రశ్నకీ
ఇదింతే మార్చలేమన్న
అశక్తతకీ
నడమ నలిగి
నాలోని మనిషి పెట్టే కేక
నాకు తప్ప మరెవ్వరికీ
వినిపించదు!

(హిందూ-ముస్లిమ్ గొడవలూ, కల్లోలాలూ, వైరుధ్యాలూ, సామాజికంగా జరిగిన హింస, ఇరువైపులా మతోన్మాదాన్ని ప్రోత్సహించే శక్తులూ ఇవన్నీ నన్ను బాధిస్తాయి. చాలా ఏళ్ళ క్రితం ఓ రాత్రి షారూక్ ఖాన్ నటించిన “చక్ దే” సినిమా చూశాను. అందులో ఇండియా-పాకిస్తాన్ హాకీ ఫైనల్ లో ఇండియా ఓడిపోతే కెప్టెన్ షారూక్ ఖాన్ ని ముస్లిమ్ కాబట్టి కావాలని పాకిస్తాన్ కి సహకరించాడని నిందవేసి సామాజికంగా వెలేస్తారు. ఆ సినిమా అంతక ముందొకసారి చూశాను. కానీ ఆ రాత్రి సినిమా చూశాక ఎందుకో చాలా బాధ కలిగింది. ఆ స్పందన నుంచి పుట్టిన వాక్యాలు ఇవి. ఇలా రాసినవి నేను “పర్సనల్” విషయాలుగా భావించి షేర్ చేసుకోడానికి ఇష్టపడను. ఇన్నేళ్ళ తరువాత మొన్న ఈ కవిత కనిపిస్తే పంచుకుంటే ఫర్వాలేదు అనిపించింది. అందుకే ఈ పోస్ట్)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s